ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని నిజామాబాద్ తెరాస ఎంపి కవిత అన్నారు. “ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో ఇచ్చిన హామీని కేంద్రప్రభుత్వం నిలబెట్టుకోవాలి. అవసరమైతే పార్లమెంటులో మేము కూడా ఏపికి మద్దతు ఇస్తాము. అయితే, ఆంధ్రప్రదేశ్ కి కల్పిస్తున్న అన్ని ప్రయోజనాలని తెలంగాణాకి కూడా కల్పించాలి,” అని ఆమె కోరారు.
కవిత మాటలు నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తునట్లుగా ఉన్నాయని చెప్పక తప్పదు. ప్రత్యేక హోదా విషయంలో ఏపికి మద్దతు ఇచ్చే విషయంలో తెరాస మొదటి నుంచి రకరకాలుగా మాట్లాడుతోంది. మొదట్లో తెరాస నేతలు ఇదేవిధంగా వాదించేవారు. ఆ తరువాత “సాటి తెలుగు రాష్ట్రమైన ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే తాము చాలా సంతోషిస్తామని” ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కాంగ్రెస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలులేదని, ఇస్తే తెలంగాణా చాలా నష్టపోతుందని ఇదివరకే గట్టిగా వాదించారు. ఆయన ఇప్పుడు తెరాసలో చేరారు కనుక ఆ అభిప్రాయం ఇంకా బలపడుతుంది. ఇటీవల కెవిపి రామచంద్ర రావు ఏపికి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, “హైకోర్టు విభజనకి సంబంధించిన అంశానికి మాత్రమే మద్దతు ఇస్తాము తప్ప ప్రత్యేక హోదాకి కాదు,” అని విస్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కవిత ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే తమకేమి అభ్యంతరం లేదు కానీ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న కారణంగానే కేంద్రప్రభుత్వం ఏపికి విభజన చట్టం ప్రకారం సహాయసహకారాలు అందిస్తోంది. అది కూడా కంటి తుడుపు సహాయమే తప్ప విభజన చట్టంలో పేర్కొన్నవిధంగా అన్ని హామీలని అమలుచేయడం లేదని, అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ చుట్టూ పదేపదే ప్రదక్షిణాలు చేస్తున్నారని, అయినా మోడీ కనికరించడం లేదనే సంగతి కవితకి కూడా తెలుసు.
ప్రత్యేక హోదా ఇవ్వక పోయినా కనీసం బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి అయినా ఇమ్మని ఆయన కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తే చివరికి రూ.1976 కోట్లు నిన్న విదిలించింది. ప్రత్యేక హోదా బదులు ఇస్తున్న ఆర్ధిక ప్యాకేజి అదేనని కేంద్రం భావిస్తోందేమో. ఇంత ఒత్తిడి చేసినా కేంద్రం వైఖరిలో ఏమాత్రం మార్పు కనబడకపోవడం గమనిస్తే ఇంక ప్రత్యేక హోదా ఇస్తుందనే నమ్మకం పోయింది.
కేంద్రప్రభుత్వం ఏపికి ఎలాగూ ప్రత్యేక హోదా ఇవ్వదని గ్రహించినందునే కవిత ఏపికి మద్దతుగా మాట్లాడుతున్నారేమో? తద్వారా తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్రా ప్రజల మెప్పు పొందవచ్చని భావిస్తున్నారేమో?అని అనుమానించవలసి వస్తోంది. కేంద్రప్రభుత్వం ఏపికి నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేస్తోంది కనుక తెలంగాణాకి కూడా అవన్నీ ఇవ్వాలని కవిత షరతు విదిస్తున్నట్లుగా భావించవచ్చు.
రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణా ధనిక రాష్ట్రంగా ఆవిర్భవిస్తుందని, అప్పుడు రాష్ట్రం ఆర్ధికంగా తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుందని తాను ఉద్యమసమయంలోనే ఊహించానని ముఖ్యమంత్రి కెసిఆర్ చెపుతుంటారు. అదే జరిగిందని ఆయనే చెప్పుకొన్నారు కూడా. విభజన తరువాత మిగులు రెవెన్యూతో ఆయన రాష్ట్రాన్ని అందుకొన్నారు. ధనిక రాష్ట్రం అని ఒప్పుకొంటున్నారు. అయినా కేంద్రాన్ని నిధులు అడుగుతూనే ఉన్నారు. అందుకు ఏపితో సహా ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఏపికి ఇచ్చిన ప్రయోజనాలన్నీ తెలంగాణాకి కూడా ఇవ్వాలని గొంతెమ్మ కోరికలు కోరడమే తప్పు. రెండు రాష్ట్రాల పరిస్థితి, వాటి సమస్యలు, అవసరాలని బట్టి కేంద్రాన్ని సహాయం అడగవచ్చు కానీ పక్క రాష్ట్రానికి ఎంత ఇస్తే అంతా తమకి కూడా ఇవ్వాలని కోరడం చిన్నపిల్లలు మారాం చేసినట్లే ఉంది. అయినా ఎవరు ఏది అడిగితే అది కేంద్రప్రభుత్వం ఇచ్చేయదని కవితకి తెలుసు.. ప్రజలందరికీ తెలుసు. మరి ఇటువంటి షరతులు సన్నాయి నొక్కులు నొక్కడం దేనికి? విమర్శలు మూటగట్టుకోవడం దేనికి?