ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నిన్న ఒక లేఖ వ్రాశారు. తనకి ఇచ్చిన హామీ ప్రకారం కాపులని రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేస్తూ లేఖ వ్రాయాలని కోరారు. సెప్టెంబర్ 8తో ముఖ్యమంత్రి ఇచ్చిన గడువు పూర్తవుతుంది కనుక ఆలోగా హామీని నెరవేర్చకపోతే మళ్ళీ ఉద్యమాలకి సిద్దం అవుతానని ముఖ్యమంత్రిని హెచ్చరించారు.
అంతవరకు బాగానే ఉంది కానీ ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్షా పోటీలు పెట్టుకొందామని ముద్రగడ వంటి సీనియర్ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రికి లేఖ వ్రాయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, తను కలిసి వారి ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షలు చేద్దామని, దాని వలన ప్రత్యేక హోదా రావడమే కాకుండా ఎవరికి ఎంత చిత్తశుద్ధి, ఎవరి శరీరంలో ఎంత పటుత్వం ఉందో ప్రజలకి కూడా తెలిసివస్తుందని వ్రాశారు. ఆయన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో ఏకధాటిగా 12రోజులు నిరాహార దీక్ష చేసినప్పుడు, బిపి, షుగర్ ఉన్న ఆయన అన్ని రోజులు ఏవిధంగా నిరాహార దీక్ష చేశారో అని తెదేపా నేతలు ఆయనని ఎగతాళి చేసినందుకే రోషం వచ్చి బహుశః ముఖ్యమంత్రికి, అయన కుమారుడుకి ఈవిధంగా సవాలు విసిరి ఉండవచ్చు. అపార అనుభవం ఉన్న ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రికి ఇటువంటి ప్రతిపాదనతో లేఖ వ్రాయడం చాలా హాస్యాస్పదంగా, అనుచితంగా ఉంది.
ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకొన్న వ్యక్తులు, తమ ప్రత్యర్ధులు విసిరే ఉచ్చుకి చిక్కుకొని తమ లక్ష్యాన్ని మరిచిపోతే, వారు ఎన్నటికీ తమ లక్ష్యాన్ని చేరుకోలేరు పైగా ప్రజలలో నవ్వులపాలవుతారు. తెలంగాణా సాధన కోసం ఉద్యమాలు ప్రారంభించిన కెసిఆర్ మధ్యలో ఎన్ని అవరోధాలు ఎదురైనా ఏనాడూ తన లక్ష్యాన్ని మరిచిపోలేదు. అందుకే ఆయన తెలంగాణా సాధించగలిగారు. కానీ కాపులకి రిజర్వేషన్లు కోసం ఉద్యమం ప్రారంభించిన ముద్రగడ పద్మనాభం తుని విధ్వంసంతో మొదటిరోజే తన లక్ష్యానికి అతిపెద్ద ఆటంకం కలిగించుకొన్నారు.
ఆ తరువాత ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టి మూడు రోజులకే ముగించడమే కాకుండా ముఖ్యమంత్రి పట్ల అనుచితంగా మాట్లాడినందుకు క్షమాపణలు కూడా చెప్పుకొన్నారు. ఆ తరువాత కాపులకి రిజర్వేషన్ల కోసం పోరాడే బదులు, తుని విధ్వంసంలో అరెస్ట్ అయినవారిని విడిపించుకొనేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ దీక్ష వలన కాపులకి అయనపై నమ్మకం పెరిగిందో లేదో తెలియదు కానీ దీక్ష ముగించిన రోజున ఇకపై కాపు సంఘాలతో కలిసి ప్రభుత్వంపై పోరాటాలు సాగిస్తానని చెప్పారు. అంటే అంతవరకు తను సరైన పద్దతిలో పోరాడలేదని స్వయంగా ఒప్పుకొన్నట్లు భావించవచ్చు. అసలు అందరూ కలిసి పోరాడటమే సరైన పద్ధతి.
తెలంగాణా కోసం పోరాడిన కెసిఆర్ ఏనాడూ చేతిలో విషం సీసా పట్టుకొని తలుపులు మూసుకొని ఇంట్లో కూర్చొని తన కుటుంబ సభ్యులతో కలిసి దీక్షలు చేయలేదు. తెలంగాణా సాధించే వరకు కూడా ఆయన, అయన కుటుంబ సభ్యులు అందరూ కూడా నిత్యం రోడ్లమీద జనం మధ్యనే ఉంటూ అవిశ్రాంతంగా పోరాడారు. ఆయన చేసిన పోరాటాలతో ముద్రగడ చేస్తున్న పోరాటాలని పోల్చి చూస్తే ప్రతీ విషయంలో తేడా కళ్ళకి కట్టినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
కాపులకి రిజర్వేషన్లు సాధించాలనే తపన, చిత్తశుద్ధి ముద్రగడకి ఉంటే ఉండి ఉండవచ్చు కానీ ఆయన దానికోసం ఎంచుకొంటున్న విధానాలు మాత్రం సరైనవి కావు..ఆమోదయోగ్యమైనవి కూడా కావనే చెప్పవచ్చు. ఆమరణ నిరాహార దీక్షల పోటీలు పెట్టుకొందామని ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖే అందుకు తాజా ఉదాహరణ. అగమ్యంగా చేస్తున్న ఆయన చేస్తున్న ఇటువంటి పోరాటాలు, పనుల వలన ఎటువంటి ఫలితం రాకపోవచ్చు. కనుక కాపులు రిజర్వేషన్లు కోరుకొంటున్నట్లయితే అందరూ కలిసి పోరాడాలి తప్ప ఈవిధంగా వ్యక్తిగత స్థాయిలో పోరాటాలు చేయడం వలన ఏమీ ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.