పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ చేసి వారం దాటిపోయింది. అందులో ముద్రగడ లాంటి వారు ఉద్యమాలు చేసి ఎవరికీ సాయపడలేదని ఓ ప్రశ్న ఆర్కే వేశారు. అది ఇప్పుడు ముద్రగడకు తెలిసిందో లేకపోతే.. ఆర్కే మీద ఏమైనా రాయవచ్చని వైసీపీ నేతల బుర్రకు తట్టిందేమో కానీ హఠాత్తుగా ఓ లేఖ రాశారు. అందులో తనను అవమానించారని ప్రారంభించి.. ఆర్కేపై రకరకాల కామెంట్లు చేశారు. ఆర్కే ఎలా ఎదిగాడో చెప్పుకొచ్చారు. ఆయన ఆంధ్రజ్యోతి ఫౌండర్ను మోసం చేసి పత్రికను స్వాధీనం చేసుకున్నారన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆర్కే బెట్టింగులు కాయించారని.. మరొకటని చాలా చెప్పారు. వాటన్నింటికీ ఆధారాలు ఉండవు.
కానీ సాక్షి లాంటి పత్రికలు.. టీవీ చానళ్లు పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి ఉపయోగపడతాయి. అదే జరిగింది. ముద్రగ ఇలా లేఖ రాయగానే అలా ఆర్కే నిజస్వరూపం అంటూ సాక్షి చెలరేగిపోయింది. ఇక వైసీపీ అనుకూల సోషల్ మీడియా సైట్ల గురించి చెప్పాల్సిన పని లేదు. అయితే ఇంటర్యూ ముగిసినప్పుడో.. తర్వాతి రోజే స్పందిస్తే.. నిజంగానే ముద్రగడకు కోపం వచ్చి ఉంటుందని అనుకునేవారు. కానీ ఆర్కే మీద బురద చల్లడానికి అవసరమైనట్లుగా టైం చూసుకుని.. లేఖ రాయడం వెనుక ఏదో వ్యూహం ఉందని అర్థమైపోయింది.
ముద్రగడ పద్మనాభం పూర్తి స్థాయిలో వైసీపీ కి పని చేస్తున్నారని కాపు నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఇచ్చిన ఐదు శాతం కాపు రిజర్వేషన్లు తీసేస్తే నోరు మెదపలేదు. కాపు కార్పొరేషన్ కు రూపాయి ఇవ్వకుండా పథకాలకు ఇచ్చే డబ్బుల లెక్కలే చూపిస్తున్నా నోరు మెదపడం లేదు. కానీ టీడీపీపై.. వైసీపీని వ్యతిరేకించే మీడియాపై మాత్రం ఆయన వైసీపీ ప్రచార వ్యూహానికి తగ్గట్లుగా రచ్చ రచ్చ చేస్తూ లేఖలు రాస్తున్నారు.