ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు! పోలీసులు వెనక్కి తగ్డం లేదు. ముద్రగడ కూడా మాట మార్చడం లేదు! కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 16 నుంచి సత్యాగ్రహ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగుస్తున్నా కాపుల రిజర్వేషన్ల విషయమై స్పందన కరువైందన్న వాదనతో ఆయన మరోసారి ఉద్యమబాట పట్టారు. రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ ఆయన తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం నుంచి ఆయన గృహనిర్భంధంలోనే ఉన్నారు. ఇంకెన్నాళ్లు అలా ఉంచుతారో కూడా స్పష్టత రావడం లేదు! ఎందుకంటే, ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు.
పాదయాత్రకు అనుమతి లేదనీ, ముందస్తు అనుమతులు తీసుకుని ఉంటే ఈ పరిస్థితులు ఉండేది కాదని పోలీసులు అంటున్నారు. ఒకరి అనుమతితో కాపుల ఉద్యమానికి పనిలేదనీ, ఎవ్వరికీ తలవంచాల్సిన అవసరం తమకు లేదని ముద్రగడ పంతం పడుతున్నారు. పోలీసులు తన ఇంటి నుంచి వెళ్లగానే పాదయాత్ర కొనసాగుతుందనీ, ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని ఆయన అంటున్నారు. పాదయాత్ర తేదీలను మార్చుతూ ముద్రగడగానీ, ఆయన అనుచరులుగానీ, కాపు సంఘాల నాయకులుగానీ ముందుగా ప్రకటిస్తే తప్ప గృహనిర్బంధం నుంచి తప్పుకునేది లేదని పోలీసులు అంటున్నారు. మొత్తానికి ముద్రగడ గృహ నిర్బంధం ఎప్పుడు ఉపసంహరిస్తారో అనే విషయమై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదని చెప్పాలి.
నిజానికి, పాదయాత్రకు పోలీసుల అనుమతి ముందే కోరి ఉంటే బాగుండేది. రాష్ట్రంలో సెక్షన్ 30 అమల్లో ఉందనీ, ఏ కార్యక్రమం చేపట్టినా ముందస్తు అనుమతులు తప్పనిసరి అని డీజీపీ ఈ మధ్య చెప్పారు. కాబట్టి, ముందే అనుమతి కోరి ఉంటే సరిపోయేది. ఒకవేళ పోలీసులు పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోతే చంద్రబాబు సర్కారును విమర్శించేందుకు మరో బలమైన పాయింట్ ముద్రగడకు దొరికేది. కాపు ఉద్యమాన్ని తెలుగుదేశం అణచివేస్తోందని అనడానికి ఉండేది. కానీ, ఇప్పుడు ఆయనే మొండి పట్టుదలకు పోతున్నారనే ఫీలింగ్ కలుగుతోంది. ఇప్పుడు కూడా తన పాదయాత్రకు పోలీసుల అనుమతులను కోరాల్సిన అవసరం లేదనే అంటున్నారు. మొత్తానికి, అటు పోలీసులూ ఇటు ముద్రగడ పద్మనాభం… ఎవరికి వారే పట్టుదలతో ఉన్నారు. ఈ చిక్కుముడి ఎలా వీడుతుందో వేచి చూడాలి.