రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నల్లధనం నిర్మూలించేందుకు ఇదే బ్రహ్మాస్త్రం అని మోడీ సర్కారును కొంతమంది మెచ్చుకుంటున్నారు. ఈ నోట్ల రద్దు విషయం మోడీ ప్రకటించేవరకూ కేంద్ర మంత్రులకుగానీ, మోడీ సన్నిహితులకుగానీ, బ్యాంకర్లకుగానీ, ప్రముఖ వ్యాపారవేత్తలకుగానీ తెలియకుండా చాలా రహస్యంగా వ్యవహరించారని కూడా మెచ్చుకోళ్లు వినిపిస్తున్నాయి. అయితే, సోషల్ మీడియాలో సంచరిస్తున్న కొన్ని వార్తల క్లిప్పింగులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి! ఈ విషయం గుజరాత్ లో చాలామందికి ముందే తెలుసు అనేది ఆ క్లిప్పింగుల సారాంశం. అక్కడి స్థానిక వార్తా పత్రికల్లో రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు అవుతాయని ఎప్పుడో కథనాలు రావడం విచిత్రంగా ఉంది!
త్వరలోనే పెద్ద నోట్లను కేంద్రం ఉపసంహరించుకుంటుందని ఆ కథనం సారాంశం. అంతేకాదు, పెద్ద నోట్లను ఎలా మార్చుకోవాలో కూడా కొన్ని నెలల కిందటే ఎలా ఊహించారన్నది విచిత్రం! అంతేకాదు, రూ. 2000 వేల నోట్లు రాబోతున్నట్టు ఊహాగానాలు కూడా అప్పుడే రావడం ఇంకా చిత్రంగా ఉంది. ఈ విషయం ముందుగానే గుజరాతీలకు తెలిసిందనీ, ఆ తరువాత పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలకూ కిందిస్థాయి నాయకులకు కూడా సమాచారం ముందే అంది ఉంటుందంటూ ఈ కథనం ఆధారంగా కొంతమంది ఆరోపిస్తున్నారు. ఒక స్థానిక పత్రికా విలేకరికే కేంద్రం తీసుకున్న ఇంత పెద్ద నిర్ణయం గురించి ఉప్పందినప్పుడు… అంబానీలూ అదానీల వంటి దిగ్గజాలకూ నాయకులకూ ఇంకా ముందే తెలిసి ఉంటుందన్న ఊహగానాలు ఇప్పుడు బాగానే వినిపిస్తున్నాయి. గుజరాతీ పత్రికతోపాటు, ఉత్తరప్రదేశ్ కు చెందిన పత్రికలోనూ ఈ నోట్ల రద్దు వార్తలు దాదాపు ఓ నెల కిందటే రావడం విశేషం!
ఈ రెండు వార్తల క్లిప్పింగులూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందరూ అన్నీ సర్దుకున్నాకనే నోట్లను రద్దు చేశారనీ, ఈ నిర్ణయంతో నల్లధనవంతులు క్షేమంగానే ఉన్నారనీ, సామాన్యులే బ్యాంకుల ముందు బారులుతీరి అవస్థలు పడుతున్నారంటూ చాలా కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇంతకీ, ఈ వార్తల క్లిప్పింగులపై భాజపా నేతలు స్పందించాలి. ఆ వార్త కథనాల సంగతేంటో చెప్పాలి. లేదంటే, దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన నిర్ణయంగా భాజపా చెప్పుకుంటున్న నల్లధన పోరాటంపై సామాన్యుల్లో అనుమానాలు పెరిగిపోతాయి!