ముంబై రియల్ ఎస్టేట్ రంగం సరికొత్త చరిత్రను సృష్టించింది. 2026 ఫిబ్రవరి నెలలో ఏకంగా 13,029 ఆస్తి రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి. గత 14 ఏళ్లలో ఫిబ్రవరి నెలలో నమోదైన అత్యధిక రిజిస్ట్రేషన్లుగా ఇది రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ముంబై ప్రాపర్టీ మార్కెట్ ఊహించని రీతిలో వృద్ధి చెందుతోందని స్పష్టమవుతోంది.
ఈ స్థాయిలో జరిగిన ఆస్తి క్రయవిక్రయాల ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. కేవలం ఫిబ్రవరి నెలలోనే స్టాంప్ డ్యూటీ , రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు రూ. 1,134 కోట్ల ఆదాయం లభించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే, ఈ ఆదాయం గణనీయంగా పెరగింది. వినియోగదారుల సెంటిమెంట్ బలంగా ఉండటం , ఆర్థిక వృద్ధి రేటు స్థిరంగా కొనసాగుతుండటమే ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ల సరళిని పరిశీలిస్తే, 500 నుండి 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నివాస గృహాలకు అత్యధిక డిమాండ్ ఉంది. మొత్తం రిజిస్ట్రేషన్లలో సుమారు 45 శాతం వాటా ఈ విభాగమే దక్కించుకుంది. మధ్యతరగతి , ఎగువ మధ్యతరగతి ప్రజలు ఇళ్ల కొనుగోలుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. అలాగే, రూ.2 కోట్ల కంటే ఎక్కువ విలువైన లగ్జరీ ఇళ్ల అమ్మకాలు కూడా ముంబైలో జోరుగా సాగుతున్నాయి.
మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెట్రో లైన్ల విస్తరణ , కొత్త రవాణా కారిడార్ల ఏర్పాటుతో ముంబై ప్రాపర్టీ మార్కెట్ పై పెట్టుబడిదారులకు నమ్మకం పెరిగింది. రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటే, ఈ జోరు మార్చి నెలలో కూడా కొనసాగే అవకాశం ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ముంబై లాంటి మెట్రో నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
