ఆంధ్రజ్యోతి జర్నలిస్టు హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్యే..!

తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై హత్య కేసు నమోదయింది. ఆంధ్రజ్యోతి విలేకరి కాతా సత్యనారాయణను మంగళవారం దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. తుని మండలం ఎస్ అన్నవరం వేంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ఈ హత్య జరిగింది. కాతా సత్యనారాయణ తొండంగి అర్బన్ విలేకరిగా పని చేస్తున్నారు. సమీపంలోనే సత్యనారాయణ ఇల్లు ఉంది. దారి కాచి.. రెక్కీ నర్వహించి మరీ హత్య చేశారు. ఈ హత్య ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా.. బీహార్‌లో ఉన్నామా.. అన్న విమర్శలు వచ్చాయి. హత్య జరిగినట్లుగా తెలిసిన తర్వాత కూడా పోలీసులు నింపాదిగా వ్యవహరించడంతో… అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి.

తొండంగి అర్బర్ రిపోర్టర్… ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అక్రమాలపై అనేక కథనాలు రాశారని.. ఈ క్రమంలో ఆయనకు ఎమ్మెల్యే అనుచరుల నుంచి పెద్ద ఎత్తున బెదిరింపులు వచ్చాయని చెబుతున్నారు. ఆయన కుటుంబసభ్యులు కూడా… సత్యనారాయణ హత్య వెనుక కచ్చితంగా దాడిశెట్టి రాజా హస్తం ఉందని చెబుతున్నారు. ఈ మేరకు వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. జర్నలిస్టు హత్యపై… అన్ని పార్టీల నేతలూ స్పందించారు. చంద్రబాబు ఏపీని దక్షిణాది బీహార్‌లా మార్చారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. మనం అసలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నామా అనే అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు మాత్రం.. సాదాసీదా ప్రకటనలు చేసి సరిపెట్టారు. పేర్నీ పేరుకు ఖండించారు కానీ.. అసలెందుకు హత్య జరిగిందో…సీరియస్ దర్యాప్తు విషయంలో మాత్రం హామీ ఇవ్వలేకపోయారు.

ఆంధ్రజ్యోతిపై.. ప్రభుత్వమే అణిచివేత ధోరణికి పాల్పడుతూండటంతో…ఆ పార్టీ నేతలు కూడా.. జర్నలిస్టులపై కత్తి దూస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఏం చేసినా ప్రభుత్వం అండగా ఉంటుందనే అభిప్రాయం బలపడుతూండటంతో.. ఏపీలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయింది. ఓ వైపు కాతా సత్యనారాయణ హత్యపై గగ్గోలు రేగుతూండగా.. శ్రీకాకులంలో.. విశాలాంధ్ర రిపోర్టర్‌పై.. వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. పేకాట శిబిరం ఫోటోలు తీయడమే కారణం. పోలీసులు వైసీపీ నేతలపై కేసు నమోదు చేసినా.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్న సందర్భాలు లేవు. దాంతో.. వారి ఆడిందే ఆట.. పాడిందే పాట అవుతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కేసే దీనికి ఉదాహరణ అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com