మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అవలంబిస్తున్న ప్రస్తుత వ్యూహం రాజకీయంగా కత్తి మీద సాములా మారింది. బీఆర్ఎస్ నాయకత్వం తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, కేవలం కూల్చివేతలకే వ్యతిరేకమని పదేపదే స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలు నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే ముద్ర పడేలా చేసే ప్రమాదం ఉంది. గతంలో తాము కూడా మూసీ సుందరీకరణ కోసం సుమారు రూ. 16,000 కోట్లతో ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్ గుర్తు చేస్తున్నప్పటికీ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.1.5 లక్షల కోట్ల ప్రణాళికకను గాంధీ సరోవర్ వంటి భారీ నిర్మాణాలను బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శిస్తోంది.
ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కడ?
హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మూసీ కాలుష్యం ఒకటి. దీన్ని పరిష్కరించడం ద్వారా నగరం ప్రపంచ స్థాయికి చేరుకుంటుందని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో పనుల్ని వ్యతేరికించడం, కోర్టులు, రాజకీయ ఉద్యమాలతో పనులు ఆపేసేలా వ్వహరిస్తే.. పనులు ఆగిపోవడానికి విపక్షమే కారణమని ప్రభుత్వం గట్టిగా ప్రచారం చేస్తే, అది బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ప్రత్యేకించి మధ్యతరగతి , ఎగువ మధ్యతరగతి ప్రజల్లో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనే భావన కలిగితే పార్టీకి ప్రతికూల అంశంగా మారుతుంది.
వ్యూహాత్మక మార్పు అవసరమా?
ప్రాజెక్టును సమూలంగా వ్యతిరేకించడం కంటే, దాని అమలులో జరుగుతున్న జాప్యం, ప్రాజెక్టు రిపోర్ట్ లేకపోవడం , నిర్వాసితుల పునరావాసం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే మేలైన వ్యూహం అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే హరీష్ రావు వంటి నేతలు ప్రభుత్వానికి స్పష్టమైన పాలసీ లేదు అని ప్రశ్నిస్తూనే, మురికి నీటిని ఆపడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అభివృద్ధిని కాదని కాకుండా, అభివృద్ధి వెనుక ఉన్న లోపాలను ఎత్తిచూపడం ద్వారానే ఎక్కువ రాజకీయ ప్రయోజనం పొందుతుంది. కానీ ఈ ప్రయత్నాలను కూడా కాంగ్రెస్ ఎప్పుడూ.. అడ్డుకునే ప్రయత్నమే అంటుంది. వాటిని కూడా రాజకీయ వ్యూహంతోనే తిప్పికొట్టాల్సి ఉంటుంది.
రాజకీయ సవాలు
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, లండన్, సింగపూర్ నమూనాలను ఉదాహరణగా చూపుతూ ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కేవలం కూల్చివేతల చుట్టూనే తన రాజకీయాన్ని తిప్పితే, భవిష్యత్తులో నగరాభివృద్ధికి ఆటంకకారిగా ముద్రపడే ప్రమాదం ఉంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, పనుల నాణ్యతను , వేగాన్ని ప్రశ్నించడం ద్వారా మాత్రమే బీఆర్ఎస్ తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా.. ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా చూసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
