సినీ పరిశ్రమలో హీరోల రేమ్యునిరేషన్ ఎప్పుడూ హాట్ టాపిక్కే. పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా ముందుకు హీరోల రేమ్యునిరేషన్ పై దృష్టి పడుతుంది. హీరోలకి అన్నేసి కోట్ల రేమ్యునిరేషన్ ఎందుకు? అని కొందరు కామెంట్లు చేస్తే.. హీరోని చూసే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు కాబట్టి.. వాళ్ళకి తగిన రేమ్యునిరేషన్ ఇవ్వడంలో తప్పేలేదనేది ఇంకొందరి వాదన. ఈ రెండూ కాకుండా.. అసలు హీరోలు నిర్మాత కష్టసుఖాలని ఏ మాత్రం పట్టించుకోరని, వాళ్ళకి డబ్బే ముఖ్యనే విమర్శ కూడా కొన్నిసార్లు వస్తుంటుంది. అయితే ఇందులో వాస్తవం లేదని అంటున్నారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్.
‘రామ్‌చరణ్ గారు (రంగస్థలం) దాదాపు రూ.4 కోట్ల తన రెమ్యూనరేషన్ బ్యాలెన్స్‌ను ఆ తర్వాత ఎప్పటికో తీసుకున్నారు. మహేశ్ గారు ‘సర్కారు వారి పాట’ పారితోషికాన్ని సినిమా విడుదలైన ఏడాదికి తీసుకున్నారు. చిరంజీవి గారు ‘వాల్తేరు వీరయ్య’కు ఇలానే చేశారు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్, ఉపేంద్ర కూడా నిర్మాత పరిస్థితి అర్థం చేసుకున్నారు. వీళ్లందరికీ డబ్బే ముఖ్యం కాదు’ అని క్లారిటీ ఇచ్చారు రవి.
మైత్రీ మూవీ మేకర్స్ సక్సెస్ రేట్ బావుంది. కథా బలం వున్న సినిమాలు తీసుకురావడంలో మంచి పనితీరు కనబరుస్తోంది మైత్రీ. నిజానికి ఈ సంస్థకి డిజాస్టార్‌లు లేవనే చెప్పాలి. రంగస్థలం, పుష్ప, జనతా గ్యారేజ్, శ్రీమంతుండు, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి..ఇలా పెద్ద హీరోలతో చేసిన సినిమాలన్నీ హిట్ కొట్టాయి.
తాజాగా రామ్ తో ఆంద్ర కింగ్ తాలూక చేశారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా బావున్నాయి. రామ్ ప్రస్తుతం అమెరికాలో సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. సినిమాకి అన్ని వైపులు మంచి పాజిటివ్ బజ్ వుంది.
