తమిళనాడు రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న నామ్ తమిళర్ కట్చి అధినేత సీమాన్, 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన 426 పేజీల భారీ మేనిఫెస్టో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేనిఫెస్టోలో ఒక్కో పేజీ..ఒక్కో వెరైటీ. అందులో ఐదు రాజధానుల హామీ కూడా ఉంది. చెన్నైపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించి, పాలనను ప్రజల చెంతకు చేర్చడమే లక్ష్యంగా ఐదు నగరాలను రాజధానులుగా సీమాన్ ప్రకటించారు. తిరుచ్చిని పరిపాలనా రాజధానిగా, చెన్నైని సాంకేతిక రాజధానిగా, కోయంబత్తూర్‌ను వాణిజ్య రాజధానిగా, మధురైని సాంస్కృతిక కేంద్రంగా , కన్యాకుమారిని జ్ఞాన రాజధానిగా తీర్చిదిద్దుతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
మేనిఫెస్టోలో ప్రధానంగా కుల ఆధారిత రిజర్వేషన్ల స్థానంలో తమిళ పౌరసత్వ రిజర్వేష తీసుకువస్తామన్న ప్రతిపాదన చర్చనీయాంశమైంది. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులు , ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రితో సహా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయించాలని నిబంధన విధిస్తామన్నారు. వ్యవసాయాన్ని ప్రభుత్వ ఉద్యోగంగా మార్చడం, నీటి వ్యాపారాన్ని రద్దు చేసి ఉచిత స్వచ్ఛమైన నీరు అందించడం వంటివి ఇందులో కీలక అంశాలు.
సీమాన్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఆయన ఒంటరి పోరు . 2010లో పార్టీ స్థాపించినప్పటి నుండి నేటి వరకు డిఎంకె, అన్నాడిఎంకె వంటి పెద్ద పార్టీలతో గానీ, జాతీయ పార్టీలతో గానీ ఆయన పొత్తు పెట్టుకోలేదు. 2026 ఎన్నికల్లో కూడా మొత్తం 234 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు ఒంటరిగానే పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. తమిళుల పాలన తమిళుల చేతుల్లోనే ఉండాలి అనే నినాదంతో రాజకీయం చేస్తున్నారు.
అయితే సీమాన్ పార్టీ ఇప్పటి వరకూ ఒక్క పార్టీ కూడా గెలవలేదు. 2011 నుండి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు ఆ పార్టీ తరపున ఎవరూ ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా ఎన్నిక కాలేదు. కానీ ఓట్ల శాతం పెంచుకుంటూ పోతోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా ఏడు శాతం ఓట్లు వచ్చాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 31 లక్షల ఓట్లు సాధించి, డిఎంకె, అన్నాడిఎంకె తర్వాత తమిళనాడులో కొన్ని చోట్ల మూడవ అతిపెద్ద పార్టీగా ఓట్ల శాతం పరంగా అవతరించింది. సీమాన్ ప్రసంగాలు, తమిళ అస్తిత్వంపై ఆయన చేసే పోరాటం ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ 50 శాతం సీట్లు మహిళలకు కేటాయించడం ఈ పార్టీ ప్రత్యేకత.

