జనసేన పార్టీ కీలక నేత నాగేంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటించారు. పార్టీ బలోపేతం కోసం ఆయన పని చేస్తున్నారు. ఉత్తరాంధ్ర పార్టీపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో శ్రీకాకుళంలో పార్టీ నేతలతో సమావేశమైన ఆయన కీలక నిర్ణయం ప్రకటించారు. తాను నేరుగా ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. పోటీ చేయాలనుకుంటే గత ఎన్నికల్లోనే చేసేవాడినని తెలిపారు.
శ్రీకాకుళం నుంచి పోటీకి ప్రయత్నమని సోషల్ మీడియాలో ప్రచారం
ఉత్తరాంధ్రపై ఇటీవల నాగబాబు ఎక్కువ దృష్టి పెట్టారు. తరచుగా శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కొంత మంది నాగబాబు శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం ప్రారంభించారు. ఇది పెరుగుతూండటంతో ఈ ప్రచారానికి చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం ప్రకటించారు. తాను అసలు పోటీ చేయనని ప్రకటించడం ద్వారా.. ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా అక్కడ పోటీ చేస్తారన్న ప్రచారం జరగకుండా ఒక్క మాటతో చెక్ పెట్టేశారని అనుకోవచ్చు.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా నాగబాబు
నాగబాబు జనసేన పార్టీ కోసం పని చేశారు. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ కూటమిలో ఆ సీటు బీజేపీకి వెళ్లింది. సీఎం రమేష్ పోటీ చేసి గెలిచారు. ఇక ముందు ఆ సీటు ఖాళీ అయ్యే అవకాశాల్లేవు. అదే సమయంలో నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు.మంత్రిగా కూడా బాధ్యతలు చేపడతారని పవన్ కల్యాణ్ చెబుతున్నారు.కానీ ఆలస్యం అయింది. నాగబాబు కూడా ఆరోగ్య కారణాలతో అంత యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు. ఆయన కూడా తన మంత్రి పదవి కోసం ఎవరిపై ఒత్తిడి తేవడం లేదు. పార్టీలో తాను నిర్వహిస్తున్న బాధ్యతలను ..రామ్ తాళ్లూరికి పవన్ అప్పగించారు.
వచ్చే ఎన్నికల నాటి పరిస్థితిని బట్టి నిర్ణయం?
ఇప్పుడు నాగబాబు ఎక్కడ పార్టీపై దృష్టిపెడితే అక్కడ పోటీకి ప్రయత్నాలు అని ప్రచారం జరగడం వల్ల కూటమిలో సమస్యలు వస్తున్నాయి. శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉండగా.. నాగబాబు పోటీ చేస్తారన్న ప్రచారం జరగడం కూటమికి సమస్యలు సృష్టిస్తుంది. అలాంటి ప్రచారాలు అసలు జరగకుండా ఉండాలంటే.. తాను పోటీ చేయను అనే ప్రకటన చేయడం మంచిదని నాగబాబు అనుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి అనుకూలంగా ఉన్న సీటు పార్టీకి లభిస్తే ఆయన పోటీకి సిద్ధంగా ఉంటారని చెప్పాల్సిన పని ఉండదు.