డీసెంట్ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకొన్న హీరో నాగశౌర్య. తన ఖాతాలో ‘ఛలో’లాంటి సూపర్ హిట్ సినిమా ఉంది. అయితే కొన్నాళ్లుగా తను సక్సెస్ లో లేడు. ‘రంగబలి’ తరవాత పూర్తిగా కనిపించలేదు. మధ్యలో కొన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కినట్టే కనిపించి ఆగిపోయాయి. కనీసం సినిమా ఈవెంట్స్ లో కూడా కనిపించడం మానేశాడు. ఇంతకాలానికి నాగశౌర్య నుంచి ఓ సినిమా వస్తోంది. అదే ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ చింతలపూడి నిర్మాత. ఈనెల 17న విడుదల చేస్తున్నారు. ఈరోజు ట్రైలర్ వదిలారు.
ట్రైలర్లో కొత్త విషయాలేం లేవు. ఇదో ఫక్తు మాస్ సినిమా అంతే. హీరో బ్యాడ్ బాయ్నా, గుడ్ బోయ్ నా అనేది క్లియర్ గా చూపించలేదు. యాక్షన్ కి పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది. కథేమిటి, హీరో క్యారెక్టరైజేషన్ ఏమిటి? అనే విషయాలేం రివీల్ చేయకుండా కట్ చేసిన ట్రైలర్ ఇది. రెండు నిమిషాల్లో లైన్ చెప్పే అవకాశం కూడా దర్శకుడు ఎందుకు తీసుకోలేదో అర్థం కావడం లేదు. కాకపోతే సముద్రఖని, సాయి కుమార్, శ్రీదేవి లతో కాస్టింగ్ బలంగా ఉంది. హారీశ్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణ బాధ్యతలు స్వీకరించారు. సో… కాస్టింగ్ పరంగా, టెక్నికల్ టీమ్ పరంగా స్ట్రాంగ్ గానే ఉంది. సినిమాకు పట్టుమని పది రోజుల వ్యవధి కూడా లేదు. ఈలోగా ఎంత ప్రచారం చేసుకొంటారో, సినిమాని జనంలోకి ఎలా తీసుకెళ్తారో చూడాలి. ఈ సినిమా హిట్టవ్వడం శౌర్యకు చాలా అవసరం. మరి తాను ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో?
