అఖిల్ కెరీర్ ఎప్పటి నుంచో ఓ పెద్ద క్వశ్చన్ మార్క్. పేరున్న కుటుంబం నుంచి వచ్చాడు. అందగాడు. డాన్సులు బాగా చేస్తాడు. ఫైట్స్ లో ఈజ్ ఉంటుంది. ఎలాంటి కథైనా డబ్బులు పెట్టి టేకప్ చేయగల సామర్థ్యం ఉంది. కానీ.. ఏం లాభం? హిట్టు లేదు. అభిమానులు కూడా ‘అయ్యగారే నెంబర్ వన్’ అనుకోవడం తప్ప, నెంబర్ వన్ విజయం ఇప్పటి వరకూ అందింది లేదు. ఎంట్రీ, రీ ఎంట్రీ, రీ..రీ ఎంట్రీ.. ఇవన్నీ అయిపోయాయి. ఇప్పటికీ హిట్లు తగల్లేదు. ఈ విషయంలో అఖిల్ పై కన్సర్న్ ఉంది ఇండస్ట్రీకి. అఖిల్ హిట్టు కొడితే చూడాలన్నది అందరి ఆశ. ఇప్పుడు ఆ బాధ్యత నాగవంశీపై పడింది.
అఖిల్ ‘లెనిన్’కి ఆయనే నిర్మాత. ఈ సినిమా అఖిల్ కెరీర్లో చాలా చాలా ముఖ్యమైనది. ఇక్కడ కూడా తప్పు చేస్తే.. ఇక వంకలు వెదుక్కోవాల్సిన పని ఉండదు. అందుకే అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. నాగవంశీ ఇది వరకు చాలా సినిమాలు చేశారు. ఆ తరవాత కూడా చేస్తారు. కానీ `లెనిన్` తనకూ స్పెషలే. ఆయన కూడా అఖిల్ ఖాతాలో హిట్టు పడాల్సిందే అని కంకణం కట్టుకొన్నారు. అఖిల్ డెబ్యూ సినిమాని ప్రొడ్యూస్ చేద్దామని తెగ ప్రయత్నించిన నిర్మాతల్లో నాగవంశీ కూడా ఉన్నారు. కానీ ఎందుకో అప్పుడు కుదర్లేదు. ఆ తరవాత కూడా చాలాసార్లు అఖిల్ తో సినిమా చేద్దామనుకొన్నారు. వీలు కాలేదు. ఇన్నాళ్లకు ‘లెనిన్’ రూపంలో ఓ ఛాన్స్ దొరికింది. అందుకే లెనిన్ ని చాలా జాగ్రత్తగా మలుస్తున్నారు నాగవంశీ. ఆయన చేతిలో చాలా సినిమాలున్నా, ఈ ప్రాజెక్ట్ పై ప్రత్యేకమైన శ్రద్ద చూపిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా నుంచి ఓ పాట వచ్చింది. అది అభిమానులకూ నచ్చింది. ఇందులో గెటప్ కూడా చాలా మాసీగా వుంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచాలని, పెద్దగా హడావుడి చేయకుండా, సైలెంట్ గా సినిమాని వదలాలని భావిస్తున్నారు. ఏం మాట్లాడినా కంటెంటే మాట్లాడాలి… అన్నది నాగవంశీ ఉద్దేశ్యం. నిజమే కావొచ్చు. కానీ అఖిల్ అసలే.. ఫ్లాపుల్లో ఉన్నాడు. కంటెంట్ తో పాటు… క్రియేటీవ్ పబ్లిసిటీ కూడా చాలా అవసరం. ఈ విషయంలో నాగవంశీ కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అఖిల్ తో సినిమా చేయాలన్న కోరిక ‘లెనిన్’ తో నెరవేరుతుంది. ఇదే సమయంలో అఖిల్ కి హిట్టు ఇవ్వాల్సిన బాధ్యత కూడా వంశీపై ఉంది. దాన్ని ఎలా భుజాలపై మోస్తారో మరి.
