అఖిల్, నాగచైతన్య కెరీర్లపై నాగ్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. వాళ్ల కథలు, హీరోయిన్లు, దర్శకులు వీటన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. నాగ్ ఓకే అననిదే… ఏ సినిమా పట్టాలెక్కడం లేదు. నాగచైతన్య ప్రస్తుతం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తనకి సోగ్గాడే చిన్ని నాయన లాంటి సూపర్ హిట్ ఇచ్చిన కల్యాణ్ కృష్ణపై నమ్మకంతో… స్క్రిప్టు విషయంలో నాగ్ ఏమాత్రం జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది. నాగ్ పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడట. అయితే.. ప్రస్తుతం రషెష్ చూసుకొన్న నాగ్ షాక్ అయ్యాడని, కొన్ని సీన్లు చూసి ‘అసలు వీటికీ కథకూ సంబంధం ఉందా?’ అని నిలదీశాడని తెలుస్తోంది. ‘స్క్రిప్టు పూర్తిగా చూపించు’ అని నాగ్ అల్టీమేట్టం జారీ చేసినట్టు, స్క్రిప్టు చూశాక కొన్ని మార్పులు చేర్పులూ చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ తీసిన కొన్ని సీన్లు మళ్లీ రీషూట్ చేస్తున్నట్టు సమాచారం.
నాగార్జున కెరీర్లో మర్చిపోలేని చిత్రం నిన్నేపెళ్లాడతా. అలాంటి సినిమా చేయాలని చైతూకీ ఉంది. సరిగ్గా నిన్నే పెళ్లాడతా కి మరో వెర్షన్ లాంటి కథని కల్యాణ్ కృష్ణ చెప్పాడని, అందుకే కథ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా నాగ్ ఓకే చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఇంటి సెట్లో షూటింగ్ జరుగుతోంది. ఇది వరకు తీసిన సీన్లనే మళ్లీ కొత్తగా రాసుకొని తెరకెక్కిస్తున్నట్టు టాక్. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో తాను ఓ పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతోంది.