నాగార్జునకు ఓ అలవాటు వుటుంది. ఓ సినిమా ఫ్లాఫ్ అయితే జనరల్ గా ఆ సినిమా ప్రస్తావన తీసుకొచ్చినపుడు ”అయిపోయింది కదా.. ఇక వదిలేయండి”అని సమాధానం చెబుతుంటారు హీరోలు. కానీ నాగార్జున మాత్రం జరిగిన తప్పులను ప్రస్తావిస్తుంటారు. ‘భాయ్’సినిమా విషయంలో జరిగిన తప్పులు గురించి మాట్లాడుతూ చాలా వరకూ దర్శకుడు వీరభద్రం చౌదరిని కార్నర్ చేసేశారు నాగార్జున. అఖిల్ సినిమా విషయంలో కూడా పరోక్షంగా డైరెక్టర్ తప్పులను ఎత్తిచూపారు. ఇప్పుడు మరో ఫ్లాఫ్ సినిమా పై తనదైన శైలిలో స్పదించారు.
నాగార్జున, రాఘవేంద్రరావు కలయికలో తెరకెక్కిన నాలుగువ భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ చిత్రాలు మంచి విజయాల్ని సాధించాయి. అయితే’శిరిడీ సాయి’ మాత్రం నిరాశ పరిచింది. ఇప్పుడీ సినిమా ఫ్లాఫ్ అవ్వడానికి గల కారణం చెప్పారు నాగ్.
”సాయి జీవితానికి తగ్గట్టుగా వాస్తవానికి దగ్గరగా ఉండేలా ఈ చిత్రాన్ని తీశాం. అందుకే నేచురాలిటీకి దగ్గరగా వెళ్లాం. వాస్తవికతను అద్దం పట్టాలనుకున్నాం. అందుకోసమే భారీ సెటప్ జోలికి పోలేదు. దీంతో సినిమాను చాలా చిన్నదిగా తీసామనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలిగింది. అదో డాక్యుమెంటరీ లా ఫీలయ్యారు. శిరిడీ సాయిపై డాక్యుమెంటరీ చూడాలంటే థియేటర్ కి ఎందుకు? ఇంటర్ నెట్ లో వుటుంది కదా అనే ఫీలింగ్ ఆడియన్స్ లో వచ్చిన మాట వాస్తవం. అయితే సినిమా మొదలుపెట్టినప్పుడు ఆ థాట్ మాకు రాలేదు. తీరా థియేటర్ లో చూసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది” అని ఓ రివ్యూ ఇచ్చారు నాగార్జున. నాగ్ మాటలు వింటుంటే భారీధనం లేకపోవడమే ఈ సినిమా వైఫల్యానికి కారణం అని భావిస్తున్నారన్నమాట.