ఈరోజు కింగ్ నాగార్జున పుట్టిన రోజు. ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియా సాక్షిగా సంబరాలు చేసుకోవాల్సిన సమయం. అయితే… వాళ్లలో ఓ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కింగ్ కొత్త సినిమాకు సంబంధించిన ఏదో ఓ అప్ డేట్ ఈసారి వస్తుందని ఆశించారు. పైగా కింగ్ చేయబోయే తదుపరి సినిమా.. తన కెరీర్లో వందో చిత్రం. సెంచరీ సినిమా అంటే ఆ హడావుడి వేరేలా ఉంటుంది. పైగా కింగ్ పుట్టిన రోజున అప్ డేట్ వస్తే ఫ్యాన్స్ లో కిక్ మామూలుగా ఉండదు. కార్తీక్ అనే తమిళ దర్శకుడు చెప్పిన కథకు కింగ్ ఓకే చెప్పడం, ఆ సినిమా ఆమధ్య గప్ చుప్ గా పూజా కార్యక్రమాలు జరుపుకోవడం జరిగిపోయాయి. అయితే అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. నాగ్ బర్త్ డే సందర్భంగా ఓ గ్లింప్స్ రెడీ చేశారని వార్తలొచ్చాయి. అది కూడా ఈరోజు బయటకు రాలేదు. బహుశా సాయింత్రం లోగా విడుదల చేస్తారేమో చూడాలి. `శివ` కొత్త వెర్షన్ సిద్ధం చేశారు. దానికి సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటన కూడా ఇంత వరకూ రాలేదు.
నాగార్జున ఈమధ్య ‘కూలీ’లో సైమన్ గా కనిపించారు. ఆ పాత్రపై నాగ్ చాలా అంచనాలు పెట్టుకొన్నాడు. అయితే అనుకొన్నంత స్థాయిలో ఆ పాత్ర పే ఆఫ్ కాలేదు. పైగా నాగ్ `ఇలాంటి పాత్ర ఎందుకు చేశాడంటూ` అభిమమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘కూలీ’ హిట్టయి, కింగ్ పాత్ర బాగా పేలి ఉంటే గనుక… ఈరోజు నాగ్ తన వందో సినిమా సంబరాలు ఘనంగా జరుపుకొనేవాడేమో? ఆ సినిమా కాస్త అటూ ఇటూ అయ్యే సరికి… పుట్టిన రోజు సైతం సైలెంట్ గా జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సాయింత్రం వరకూ టైమ్ ఉంది కదా, ఈలోగా కింగ్ వందో సినిమాకు సంబంధించిన ఏదైనా ఓ సర్ప్రైజ్ రివీల్ అవుతుందేమో చూడాలి.