కొత్త తరహా కాన్సెప్టుల్ని ప్రోత్సహించడానికి ఎప్పుడూ నాగార్జున ముందుంటాడు. కథ నచ్చితే… దర్శకుడెవరు? అనేదీ పట్టించుకోడు. అందుకు రుజువులెన్నో. ఆ జాబితాలో మరో సినిమా చేరింది. అదే.. ‘రాజుగారి గది 2’. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈరోజే (ఆదివారం) మొదలైంది. హారర్ తరహా చిత్రంలో నాగ్ నటించడం ఇదే తొలిసారి. అందుకే నాగ్ ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. రాజుగారి గది2 లో నాగార్జున అనగానే.. నాగ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అనే ఆసక్తి మొదలైంది. దానికి నాగ్ ఓ క్లూ కూడా ఇచ్చేశాడు. ‘నాది మనుషులతో ఆడుకొనే పాత్ర’ అంటూ హింట్ వదిలాడు. ‘మనుషులతో’ అనే మాట వచ్చింది కాబట్టి, ఇందులో నాగ్ దెయ్యంగా కనిపించే ఛాన్సులే ఎక్కువగా ఉన్నాయి. రాజుగారి గది సినిమాకి సీక్వెల్‌గా వస్తున్నా.. ఆ సినిమాకీ ఈ కథకీ ఎలాంటి పోలికలూ లేవని సమాచారం. కేవలం రాజుగారి గది బ్రాండ్‌ని వాడుకోవడానికే ఆ పేరు పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈకథపై, ఓంకార్‌పై మాత్రం నాగ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. కొత్త కథల్ని ఎంచుకోనే ప్రయత్నంలో తనకు మరో మంచి కథ దొరికిందని, ఓంకార్‌పై తనకు చాలా నమ్మకం ఉందని, అందుకే రాజుగారి గది సినిమాని చూడకుండానే ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చానని చెబుతున్నాడు నాగ్.
మరోవైపు ఇక ముందు హీరోగా కనిపించను అనే హింట్ ఇచ్చాడు నాగార్జున. వయసు పెరుగుతోందన్న విషయం గుర్తు చేస్తూ.. ఇక మీదట ‘కీ రోల్స్’ ఎంచుకోవాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగా ఈ సినిమా చేస్తున్నానని చెబుతున్నాడు నాగ్. ఒక విధంగా ఊపిరి సినిమా నుంచే నాగార్జున ఆలోచనలు చాలా మారాయి. రెగ్యులర్ హీరోయిజం ఉన్న పాత్రల్ని నాగ్ అస్సలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. నాగార్జున కెరీర్‌కే కాదు… టాలీవుడ్ కథలకూ ఇది సరికొత్త పరిణామం. వయసు యాభై దాటినా ఇంకా పదహారేళ్ల అమ్మాయిలతో డ్యూయెట్లు పాడాలని, పంచ్ డైలాగులు చెప్పాలని పరితపించిపోయే వయసైపోయిన కథానాయకులకు నాగ్ నిర్ణయం కనువిప్పు కలిగించేదే.ఇదే స్ఫూర్తి, ఇవే ఆలోచనలు మిగిలిన సీరియర్ హీరోలకూ వస్తే టాలీవుడ్ బాగుపడిపోయినట్టే.