చిరంజీవి, బాలకృష్ణ ఎప్పుడో సెంచరీ సినిమాలు దాటేశారు. చిరుకైతే 150వ సినిమా కూడా పూర్తయ్యింది. నాగ్ మాత్రం ఇంకా వంద కొట్టలేదు. అది ఎప్పుడు అవుతుందో చెప్పలేని పరిస్థితి.
టెక్నికల్ గా చూస్తే నాగార్జున వంద సినిమాలు ఎప్పుడో పూర్తయ్యాయి. కానీ వందో సినిమా సమ్ థింగ్ స్పెషల్ గా ఉండాలి కదా. అందుకే ఆ వందో సినిమా విషయంలో లెక్కలు మారుతున్నాయి. నాగ్ కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలు చేశాడు. అవి తన ఫిల్మోగ్రఫీలో లెక్క వేయాలా? లేదా? అని ఆలోచిస్తున్నాడు.
నాగ్ ఆలోచన ఏమిటంటే.. ఏదైనా అద్భుతమైన కథ, కాంబో సెట్ అయితే.. అప్పుడు దాన్ని వందో సినిమాగా ప్రచారం చేసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఓ తమిళ దర్శకుడితో ట్రావెల్ చేస్తున్నాడు నాగ్. అన్నీ కుదిరితే ‘కుబేర’, ‘కూలీ’ తరవాత నాగ్ చేయబోయే సినిమా ఇదే. అన్నపూర్ణ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాని వందో సినిమాగా ప్రకటించాలని నాగ్ భావించాడు. కానీ ఎందుకో ఇప్పుడు మనసు ఒప్పుకోవడం లేదు. పెద్ద దర్శకుడితో సినిమా ఓకే అయితే, అప్పుడు దాన్ని సెంచరీ సినిమాగా ప్రకటించి, హడావుడి చేయాలన్నది నాగ్ ప్లాన్. కాబట్టి నాగ్ వందో సినిమా ఇంకా పెండింగ్ లో ఉన్నట్టే.
‘మనం’ సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఎలాగైతే స్పెషల్ గా మారిందో, అలానే నాగ్ వందో సినిమానీ తీర్చిదిద్దితే బాగుంటుందన్నది అక్కినేని అభిమానుల ఆశ. అందులో చైతూ, అఖిల్ కనిపిస్తే చూడాలని అనుకొంటున్నారు. మరి నాగ్ మనసులో ఏముందో? అలాంటి కథ ఎప్పుడు వస్తుందో?