నాగార్జున 100వ సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలైన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు కార్తీక్ ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. దీనికి ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. హీరోయిన్ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. అయితే… టబు ఓ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని ఇన్ సైడ్ వర్గాల టాక్. నాగ్ – టబు కాంబో ఎప్పుడు సెట్ అయినా ఫ్యాన్స్కి జోష్ వచ్చేస్తుంది. ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాలతో అలరించిన జంట ఇది. వాళ్లిద్దరి మధ్య ఉండే బాండింగ్ కూడా సమ్ థింగ్ స్పెషలే. ఆమధ్య వీరిద్దరూ మళ్లీ కలిసి నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఏదీ నిజం కాలేదు. నాగ్ వందో సినిమా కోసం టబుని ప్రత్యేకంగా రంగంలోకి దించడానికి టీమ్ గట్టిగా ప్రయత్నిస్తోందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే… టబు ఎంట్రీ అదనపు ఆకర్షణ అవుతుంది.
నాగ్ వందో సినిమా కాబట్టి సినిమా నిండా చాలా ప్రత్యేకతలు కనిపించే అవకాశం వుంది. నాగచైతన్య, అఖిల్ కూడా గెస్ట్ రోల్స్ లో దర్శనం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇదో పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం. నాగ్ స్టైల్ లో కాస్త యాక్షన్ కూడా జోడించారు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు అన్నీ గోప్యంగా ఉంచాలని, సమయం చూసుకొని, ఒకొక్కటిగా రివీల్ చేయాలని నాగ్ భావిస్తున్నారు. ఇటీవల నాగ్ ‘కూలీ’లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల కెరీర్లో ఆయన తొలిసారి విలన్ గా కనిపించారు. ఆయన లుక్, స్టైల్, గ్రేస్ ఫ్యాన్స్కి బాగా నచ్చాయి. కాకపోతే అనుకొన్న ఫలితం మాత్రం రాలేదు.