సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చే ప్రతీ సినిమాకంటూ ప్రత్యేకించి పబ్లిసిటీ స్ట్రాటజీ అవసరం లేదు. నిర్మాత నాగవంశీ బయటకు వచ్చి మాట్లాడితే బోలెడంత ప్రచారం. ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఇంటర్వ్యూలలో ఆయన కామెంట్లు వైరల్ అవుతుంటాయి. తన స్పీచులతోనే కావల్సినంత హైప్ ఇచ్చేస్తుంటారాయన. అయితే నాగవంశీకి వరుసగా రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. తన బ్యానర్ లో వచ్చిన కింగ్ డమ్ నష్టాల్ని మిగిల్చింది. ఇక తెలుగులో పంపిణీ చేసిన వార్ 2తో గట్టి ఎదురు దెబ్బే తగిలింది. హిట్టూ, ఫ్లాపులు అటుంచితే.. ఆయా సినిమాల విడుదల సమయంలో నాగవంశీ ఇచ్చిన స్పీచులు వైరల్ అయ్యాయి. సినిమాపై హైప్ అమాంతం పెంచేశాయి. `ఈ సినిమా ఫ్లాప్ అయితే నన్ను అడగండి.. కాలర్ ఎగరేసే సినిమాలు ఇస్తున్నా` అంటూ స్పీచులు దంచి కొట్టారు. కింగ్ డమ్, వార్ 2 సినిమాలు విడుదలయ్యాక.. ఆ స్పీచులతోనే సోషల్ మీడియాలో కౌంటర్లు ఇవ్వడం మొదలెట్టారు అభిమానులు. వార్ 2 రిలీజ్ అయిన వెంటనే నాగవంశీ దుబాయ్ వెళ్లిపోయారని, ఆస్తులు అమ్ముకొన్నారని రకరకాల వార్తలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాకు కొంత కాలం దూరంగా ఉంటానంటూ నాగవంశీ కూడా ప్రకటించారు. అన్నట్టుగానే ఆయన నుంచి పెద్దగా కదలిక లేదు.
కాకపోతే ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి `మాస్ జాతర` సినిమా వస్తోంది. రవితేజ 75వ చిత్రమిది. రెండు మూడు సార్లు రిలీజ్ డేట్ ప్రకటించి వాయిదా వేశారు. ఇప్పుడు 31న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మామూలుగా అయితే నాగవంశీ తన సినిమా ప్రమోషన్ల విషయంలో విజృంభిస్తుంటారు. అయితే కింగ్ డమ్, వార్ 2 ఫలితాల వల్ల నాగవంశీ మీడియా ముందుకు రారని, తెర వెనుక నుంచే ప్రమోషన్లు చేస్తారని అనుకొన్నారు. అయితే ఇప్పుడు నాగవంశీ ఆలోచన మారింది. గత సినిమాల్లానే `మాస్ జాతర`ని ప్రమోట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే రవితేజకు ఇది 75వ చిత్రం. ఈ సినిమాపై బాగా ఖర్చు పెట్టారు. కాబట్టి ప్రమోషన్లలో లోటు రాకూడదు. అందులో భాగంగానే రవితేజతో ఓ కామన్ ఇంటర్వ్యూ వదిలారు. అందులోనే వార్ 2 తరవాత తనపై వచ్చిన విమర్శలకు తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. మీడియా ముందుకు వచ్చినా అవే ప్రశ్నలు ఎదురవుతాయి. కాబట్టి.. ఎలాంటి సమాధానాలు ఇవ్వాలనే విషయంలో నాగవంశీ మానసికంగా సిద్ధమైనట్టే. సో.. ఈసారి కూడా నాగవంశీ మీడియా ముందుకు రావడం ఖాయమనే చెప్పాలి. రవితేజ ఎలాగూ.. మీడియాకు పర్సనల్ గా ఇంటర్వ్యూలు ఇవ్వరు. దర్శకుడు కొత్తవాడే. శ్రీలీల మహా బిజీ. ప్రమోషన్లకు టైమ్ ఇస్తుందో లేదో తెలీదు. కాబట్టి.. ప్రమోషన్ల పర్వాన్ని ముందుకు నడిపించే బాధ్యత నాగవంశీదే.