ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలా (సాగేతర భూమి అసెస్మెంట్) చట్టం-2006 నాలాను రద్దు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముందుగా అమల్లోకి తెచ్చేందుకు ఆర్డినెన్స్ కూడా తీసుకువస్తున్నారు. దీని వల్ల వ్యవసాయ భూమిని సాగేతర అవసరాలకు మార్చడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు.
నాలా చట్టం ఫీజు అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అసెస్మెంట్ ఫీజు. వ్యవసాయ భూమిని పరిశ్రమలు, ఇళ్లు నిర్మించుకోవడానికి .. కన్వర్షన్ చేయించుకోవాలి. ఇందు కోసం గతంలో మూడు శాతం పన్ను ఉండేది. వైసీపీ వచ్చాక ఐదు శాతం చేసింది. ప్రస్తుత ప్రభుత్వం నాలుగు శాతానికి తగ్గించాలని నిర్ణయించింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ ఫీజు పెద్ద సమస్య కాదు. సరైన వ్యవస్థ లేకపోవడమే పెద్ద సమస్యగా ఉండేది. అధికారులు దీన్ని తమ లంచాలకు ఆదాయ వనరుగా చేసుకున్నారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ల్యాండ్ కన్వర్షన్ కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ల్యాండ్ కన్వర్షన్ కోసం దరఖాస్తు చేస్తే, రెవెన్యూ అధికారులు గద్దల్లా వాలిపోతారు. భూమిని ప్లాట్లుగా మార్చి రోడ్లు వేస్తే, అడిగినంత చెల్లించాల్సిందే. లేకపోతే అనుమతి కోసం కాలయాపన తప్పదు.
నాలా చట్టం అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారిందని రియల్టర్లు చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు వారి సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. నాలా చట్టం రద్దుతో రియల్ ఎస్టేట్ రంగం తిరిగి ఊపందుకుంటుందని, పారిశ్రామికవేత్తలకు సులభతరమైన అనుమతులు లభిస్తాయి. నాలా చట్టం రద్దుతో ల్యాండ్ కన్వర్షన్ కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు.