ఇండియా – పాక్ యుద్దం ఇప్పుడు చిత్రసీమపైనా ప్రభావాన్ని చూపిస్తోంది. పాక్ నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని భాయతీయ చలన చిత్రసీమ నుంచి బహిష్కరించడం పలు భిన్న వాదనలకు తావిస్తోంది. మెజార్టీ వర్గం ఈ బహిష్కరణ సరైనదే అంటున్నా… కొంతమంది మాత్రం విశాల దృక్పథంతో ఆలోచించి ‘ఈ నిర్ణయం సరికాదు’ అంటూ వారిస్తున్నారు. సల్మాన్ ఖాన్ సైతం ‘పాక్ నటీనటులు, సాంకేతిక నిపుణులు తీవ్రవాదలు కాదు, కళాకారులు’ అంటూ సానుభూతి వ్యక్తం చేశాడు. దాంతో సల్మాన్ ఖాన్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. సల్మాన్‌కి వ్యతిరేకంగా ఆన్ లైన్లో ఓ చిన్న పాటి యుద్దమే నడుస్తోంది. సల్మాన్‌ని టార్గెట్ చేస్తూ మాట్లాడే సెలబ్రెటీలు కూడా ఎక్కువయ్యారు. తాజాగా విలక్షణ నటుడు నానాపటేకర్ కూడా తనదైన శైలిలో స్పందించాడు.
కళాకారులనేవాళ్లు ఎవరైనా సరే…. దేశం ముందు ఆవగింజలాంటివాళ్లని, దేశం తరవాతే ఏదైనా అని.. దానికి కళ మినహాయింపు కాదని క్లారిటీగా చెప్పేశాడు నానా. అంతేకాదు.. తాము సినిమాల్లో హీరోలుగా నటిస్తామని, నిజమైన హీరోలు సరిహద్దుల్లో పోరాడే సైనికులే అని… సినిమా వాళ్లు ఏం చెప్పినా నమ్మొద్దని, వాళ్లు కేవలం ఆటవిడుపుకి తోచిందేదో మాట్లాడుతుంటారని పరోక్షంగా సల్మాన్‌పై కౌంటర్ వేశాడు నానా పటేకర్. బాలీవుడ్ ఏం నిర్ణయం తీసుకొన్నా.. దాన్ని వ్యక్తిగత నిర్ణయాలతో, అభిప్రాయాలతో లింకులు పెట్టొద్దని.. తాను ముందు ఓ దేశభక్తుడిగా, పౌరుడిగా స్పందిస్తానని, ఆ తరవాతే నటుడ్ని అని గుర్తు చేశారు. నానా పటేకర్ సల్మాన్ ఖాన్ని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యల్ని యాంటీ సల్మాన్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.