హరికృష్ణకు డ్రైవింగ్ ఉత్సాహం – స్మోకింగ్ ఉల్లాసం

నందమూరి హరికృష్ణ డ్రైవింగ్ ను బాగా ఎంజాయ్ చేసేవారు. 1983 లో ఎన్ టి ఆర్ రాష్ట్రమంతా తిరిగిన చైతన్యరధం (చావర్లెట్ వేన్) డ్రయివర్ హరికృష్ణే!

చిత్తురు దగ్గర ఒక చిన్న రైల్వే బ్రిడ్జ్ కి ముందున్న ఇనుప గర్డర్ ను గమనించి వెహికల్ ను బాగా కంట్రొలు చేశారు. అయినా కూడా టాప్ మీద కూర్చుని వున్న ఎన్ టి ఆర్ తలను గర్డర్ గా అమర్చిన రేకు గొట్టాం తాకింది. నొసలు కాస్త చిట్లింది. అపుడు రాత్రి 8 గంటల సమయం. ఎన్ టి ఆర్ తలకు జనరల్ ఆస్పత్రిలో కట్టు కట్టారు. రెండు ఇంజక్షన్లు ఇచ్చారు. ఆస్పత్రి ఆవరణ కిక్కిరిసి పోయింది. అభిమానులు ఆందోళనగా వున్నారు. హరికృష్ణ వరండాలో ఒక మూల చేతులు కట్టుకుని దిగులుగా నిలుచున్నారు. ఎవరో డాక్టర్ వచ్చి ఏ ఇబ్బందీ లేదు వెళ్ళి మాట్లాడండి. అనిచెప్పారు.

హరికృష్ణ బయటికి వెళ్ళారు. చెట్టుకిందికి చేరారు. పక్కన ఇద్దరో ముగ్గురో వున్నారు.
వాళ్ళు జనాన్ని దగ్గరకు రాకుండా చూస్తున్నారు. వాళ్ళలో ఒకరు ఇచ్చిన సిగరెట్ ను హరికృష్ణ వెలిగించి గుండెనిండా దమ్మపీల్చడాన్ని గమనించాను.

చైతన్యరధ సారధిగా నిరంతరం వందల మంది మధ్య వున్నా హరికృష్ణ ఒక ఇంట్రోవర్ట్ అనిపించేది. ఎవరితోనూ మాట్లాడేవారుకాదు. ఎన్ టి అర్ టూర్ కవరేజిలో భాగంగా, ఈనాడు ప్రతినిధిగా నా నాలుగైదు నెలల పరిశీలనలో హరికృష్ణ పెద్దగా నవ్వడం కూడా కనబడలేదు. ఆ వొంటరి హరికృష్ణ కు సిగరెట్లే తోడూ నీడా అనిపించేది. రధంపై ఎన్ టి ఆర్ ఉపన్యాసం మొదలుకాగానే అయనకు వాసన సోకని తీరులో గాలివాలు చూసుకుని వేన్ పక్కనే నిలబడి సిగరెట్ వెలిగించే వారు. గోల్డ్ ఫ్లేక్ కింగ్ సైజు సిగరెట్లు ఇవ్వడానికి కార్యకర్తలు పొటీపడేవారు. ఒక సారి సిగరెట్టు ఇచ్చేవారు లేక సైగ ద్వారా నన్ను అడిగారు. నా బ్రాండు సిజర్స్. తీసుకువెళ్ళి ఇచ్చాను. ఏ బ్రాండో అడిగారు… చెప్పాను. గట్టిగా దమ్ముపీల్చి, షాహిదక్కన్ దొరుకుతుందా అది స్ట్రాంగ్ అన్నారు. ఈ ఏరియాలో చార్మినార్ దొరుకుతుందన్నాను. (తరువాత కాలంలో నేను స్మోకింగ్ మానేశాను. హరికృష్ణ గారి విషయం నాకు తెలియదు)

*****

లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా చంద్రబాబు నడిపిన తెరవెనుక వుద్యమానికి తెరముందన్న మొదటి హీరో హరికృష్ణే! తూర్పుగోదావరి జిల్లానుంచే ఆయన పర్యటన మొదలైంది. హరికృష్ణ కు గన్నికృష్ణ డ్రైవర్ గా వున్నారు. జిల్లాలో రోడ్ షోలో 7 చోట్ల హరికృష్ణ ఉపన్యసించారు. రాజ్యాంగేతరశక్తి అని మొదలు పెట్టినా మాట్లాడడం వచ్చేది కాదు. డ్రైవింగ్ చేసే నన్ను స్పీకర్ గా మార్చేశారు. పక్కకి వెళ్ళి సిగరెట్టు కాల్చుకోవడం కుదరడం లేదు అని జగ్గంపేట ఏరియాలో ఒక మీటింగు తరువాత విలేకరులతో టీ తాగుతూ హరికృష్ణ అన్నారు.

*****

ఇష్టపూర్వక వ్యాపకమైన డ్రైవింగ్ చేస్తూండగానే హరికృష్ణ ప్రమాదంపాలై ప్రాణం పోవడం అత్యంత విషాదం – పెద్దాడ నవీన్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com