కళాకారుడు ఎవరికైనా సరే, కావల్సింది కాస్త ప్రోత్సాహం.. గౌరవం. అవి రెండూ జగన్ ప్రభుత్వ హయాంలో కనుమరుగైపోయాయి. సినిమా వాళ్లని అస్సలు పట్టించుకోలేదు. టికెట్ రేట్లు తగ్గించి అవమానపరిచారు. అవార్డులు, ప్రోత్సాహకాల మాటే లేదు. నంది అవార్డు మొహం చూసి సినిమా ఇండస్ట్రీ చాలా కాలం అయిపోయింది. ఇటు తెలంగాణలోనూ అంతే. ఇప్పుడు రెండు చోట్లా ప్రభుత్వాలు మారాయి. అవార్డుల్ని పునరుద్ధరించే పనిలో పడ్డాయి. నంది అవార్డులు ఇస్తున్నాం అంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం అవుతోంది. ఇప్పుడు ఏపీ నుంచి కూడా శుభవార్త అందింది. త్వరలోనే నంది అవార్డుల ప్రక్రియ ప్రారంభిస్తామని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. చిత్రసీమకు కావాల్సిన అన్ని మౌళిక సదుపాయాలూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని, వాటిని మరింతగా అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు.
నంది అవార్డులు చాలా ఏళ్ల నుంచి ఇవ్వడమే లేదు. పాతవన్నీ ఒకేసారి క్లియర్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. అయితే పదేళ్ల అవార్డుల్ని ఒకేసారి ఇవ్వాలా? లేదంటే దశల వారీగా ఇవ్వాలా? అనేదే తెగడం లేదు. అన్ని అవార్డుల్నీ ఒకేసారి ప్రకటించి, మూడు రోజుల పాటు సాంస్క్రతిక కార్యక్రమాలు నిర్వహించి, ఓ పండగలా చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వుంది. అది ఖర్చుతో కూడుకున్న పనే. కానీ… చిత్రసీమ కోసం ఈమాత్రం చేయకపోతే ఎలా? అనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. పైగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ కూడా నంది అవార్డుల పండగ ఘనంగానే చేద్దామంటున్నార్ట. యేడాది వారీగా కమిటీలు ఏర్పాటు చేసి, విజేతల్ని ఎంపిక చేయడం పెద్ద ప్రోసెస్. అది వీలైనంత త్వరగా మొదలు పెడితే బాగుంటుంది. తెలంగాణ నంది కమిటీ ఇప్పటికే తమ పనులు ప్రారంభించింది. ఏపీ నుంచి కూడా అలాంటి అడుగు వేయాలి.