మాటలే కాదు, మూలంలోనే దెబ్బ

నంద్యాలలో తెలుగుదేశం గెలుస్తుందని మొదటి నుంచినేను చెబుతూనే వున్నాను. దీనికి ఆధారం అక్కడ సామాన్య ప్రజలతో మాట్లాడిన మాటలే గాని రాజకీయ పార్టీలో మీడియా కథనాలో కాదు. భూమా దంపతుల మరణం తర్వాత మంత్రి పదవి వచ్చిన అఖిలప్రియ పట్ల ఒకింత అభిమానం, అధికార పార్టీ గెలిస్తే ఇప్పుడు మొదలు పెట్టిన పనులు పూర్తవుతాయనే ఆశ ఈ రెండూ అక్కడ ప్రధానంగా పనిచేశాయి. ఆపైన డబ్బు అధికార యంత్రాంగం పట్టు. ప్రతిపక్ష నేత జగన్‌ మాటలు తప్పే గాని ఆయనో లేక రోజానో మాట్లాడిన తీరు బట్టి ఫలితం మారిందేమీ లేదు. వైసీపీని ప్రజలు అంతకన్నా తీవ్రంగా తీసుకోలేదని అర్థమవుతూనే వచ్చింది. గెలిచిపోయినట్టే భావించి తమ ప్రచార సరళిని నాయకుల మొహరింపును సమీక్ష చేసుకోవడానికి కూడా ఆ పార్టీ సిద్ధం కాలేదు. బిజెపితో కొత్త చెలిమి కారణంగా రాష్ట్రంపట్ల కేంద్రం నిర్లక్ష్యం చర్చకు తీసుకోలేదు. దాంతో తిట్ల పురాణం సవాళ్ల పరంపరగా మారిపోయింది. సర్వేలు చెబుతున్న అంచనాలు అస్సలు పట్టించుకోలేదు. ఇదంతా స్వయం కృతాపరాథమే. మీడియా వ్యక్తిగా చెప్పాలంటే సాక్షి సంస్థలు కూడా ఎన్నికల సమయం గనక ఏకపక్ష చిత్రణతో కొంత దారి తప్పించాయనాలి. ఫలితం ఈ భారీ తేడా. ఈ పరాజయాన్ని వైసీపీ తక్కువ అంచనా వేస్తే వారికే నష్టం. శిల్పా మోహన రెడ్డి వంటి గట్టి అభ్యర్థి లేకపోతే ఇంకా దెబ్బతినేవారు. అలాగే టిడిపి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా వ్యయప్రయాసలు పడిన తీరు మర్చిపోయి విజయాన్ని అతిగా లెక్కేసుకుంటే వారికీ నష్టమే. వైసీపీ గెలిస్తే మిగిలిన పాలనా కాలమంతా దాని దూకుడును టిడిపి ఎదుర్కోవలసి వచ్చేది. ఇప్పుడా బాధ తప్పింది .అదొక్కటే లాభం. మరి మొదలు పెట్టిన పథకాలు పూర్తి చేయవలసిన బాధ్యత మాత్రం పాలకపార్టీపై వుంది. ప్రశాంతతను కాపాడవలసిన బాధ్యత ఇరువురిపైనా వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.