ఈరోజు టాలీవుడ్ ఇండ్రస్ట్రీలో నానికి ఉన్న రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొబ్బరికాయ్ కొట్టగానే నాని బిజినెస్ మొదలైపోతుంది. జాగ్రత్తగా తీసుకొంటే టేబుల్ ప్రాఫిట్ కూడా వచ్చేస్తుంది. అందుకే నాని నిర్మాతల కొంగు బంగారమయ్యాడు. నాని కాస్త గట్టిగా ట్రై చేస్తే.. టాప్ దర్శకులతో సినిమాలు తీసే ఛాన్సుంది. కానీ. నాని ఎప్పుడూ కొత్త కథలకు, కొత్త దర్శకులకూ ఓటేశాడు. అందుకే నాని చుట్టూ కొత్త దర్శకులు ప్రదక్షిణాలు చేస్తుంటారు. హిట్ దర్శకులతో సినిమాలు తీసే స్టామినా ఉన్న నాని… ఇప్పుడు ఓ ఫ్లాప్ దర్శకుడికి అవకాశం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తనే.. వేణు శ్రీరామ్. దిల్‌రాజు కాంపౌండ్ నుంచి వచ్చిన వేణు… ఇది వరకు ఓమై ఫ్రెండ్ సినిమా తీశాడు. సిద్దార్థ్, శ్రుతిహాసన్, హన్సిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. దాంతో వేణు శ్రీరామ్ అనే దర్శకుడు ఐదేళ్లుగా సినిమాల్లేక ఖాళీగా ఉన్నాడు.
ఇప్పుడు వేణు శ్రీరామ్ ఓ కథ తయారు చేసి, నానికి వినిపించాడని సమాచారం. ఆ కథకు నాని నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని సమాచారం. ఈ సినిమాని దిల్‌రాజు తెరకెక్కించే అవకాశాలున్నాయి. నాని తాజా చిత్రం ‘నేను లోకల్’ కూడా దిల్ రాజు బ్యానర్ నుంచే వస్తోంది. ఇది వరుసగా రెండో సినిమా అన్నమాట. అష్టాచమ్మా తీసిన ఇంద్రగంటి ఆ తరవాత ఫ్లాపుల్లో పడినా… తనపై నమ్మకంతో ఓ అవకాశం ఇచ్చాడు. జెంటిల్మెన్తో హిట్టూ కొట్టాడు. అదే నమ్మకంతో ఇప్పుడు వేణు శ్రీరామ్ కథకీ ఓకే చెప్పినట్టున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా వేణుకి దిల్‌రాజు లాంటి ఫిల్మ్‌మేకర్ అండదండలున్నాయి. వేణుని కాకపోయినా, ఆయన్నయినా భేషుగ్గా నమ్మేయొచ్చు. నాని.. నమ్మకం అదన్నమాట.