నాని… ఓ బుల్లి సూపర్ స్టార్. తన సినిమా అంటే వసూళ్ల గలగల ఖాయం. కొత్తగా ఉంటుంది.. కమర్షియల్గానూ ఉంటుంది. అందుకే నాని సినిమా అనేసరికి బాక్సాఫీసు దగ్గర పండగ వాతావరణం నెలకొంటుంది. స్టార్ దర్శకులతో సినిమాలు చేయగల సత్తా.. ఎప్పుడో నానికి వచ్చేసింది. స్టార్ కథానాయకులతోనూ నటించే స్థాయికి చేరుకొన్నాడు. కాకపోతే… నాని సినిమా అనగానే హీరోయిన్లుగా కొత్త మొహాలే కనిపిస్తాయి. స్టార్ హీరోయిన్లతో పనిచేసింది చాలా చాలా చాలా తక్కువ. అయితే తన సినిమాల ద్వారా కొత్త కథానాయికల్ని పరిచయం చేస్తుంటాడు. వాళ్లేమో స్టార్లుగా మారిపోతుంటారు. మీ సినిమాలో స్టార్ కథానాయికలు ఎందుకు కనిపించరు?? అని అడిగితే నాని స్పందించాడు. స్టార్ హీరోయిన్లతో పెట్టుకొంటే.. తన సినిమాలు లేటవ్వడం ఖాయమని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు.
”యేడాదికి నాలుగు సినిమాలు చేసేస్తుంటా. మూడు నెలలకు ఓ సినిమా పూర్తవ్వాలి. స్టార్ కథానాయిక కావాలని కూర్చుంటే కాల్షీట్ల ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ల కోసం ఎదురుచూస్తూ సినిమాని పోస్ట్ పోన్ చేయలేం. అందుకే అందుబాటులో ఉన్న కథానాయికల్ని ఎంచుకొంటుంటా. పైగా నా సినిమాతో ఓ కొత్త నాయిక పరిచయమైతే ఆ క్రెడిట్ నాక్కూడా దక్కుతుంది కదా? భవిష్యత్తులో వాళ్లు స్టార్స్ అయిపోతే.. అందులో నా ప్రమేయం కూడా ఉంది అంటూ గొప్పగా చెప్పుకోవొచ్చు” అంటూ అసలు విషయం చెప్పేశాడు. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం గురించి కూడా నాని మనసు విప్పాడు. “నేను కొత్త దర్శకులతో పనిచేయడం లేదు. భవిష్యత్తులో స్టార్స్ అయ్యే దర్శకులతో వర్క్ చేస్తున్నా“ అని చెప్పుకొచ్చాడు నాని.