ఒకప్పుడు నాని సినిమా అంటే ‘మినిమం బడ్జెట్లో తీసేయొచ్చు’ అనుకొనేవారు. రూ.20 -30 కోట్ల మధ్యలో ముగిసిన సినిమాలెన్నో. రెండు మూడేళ్ల క్రితం వరకూ కూడా నాని సినిమా రూ.50 కోట్లలోపు అయిపోయేది. ‘శ్యామ్ సింగరాయ్’, ‘దసరా’, ‘సరిపోదా శనివారం’లాంటి సినిమాలు బడ్జెట్ పరంగా భారీవి. ‘హిట్ 3’కి కూడా బాగానే ఖర్చు పెట్టారు. అయితే వీటిలో ఏది కూడా రూ.100 కోట్లు దాటలేదు. అయితే నాని తాజా సినిమా ‘పారడైజ్’ కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఓ మీడియం రేంజ్ హీరో సినిమాకు ఇంత ఖర్చు పెట్టడం ఇదే తొలిసారని, నాని రేంజ్‌కు ఇది నిదర్శనం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తుతున్నాయి.
ఈమధ్య కాలంలో నాని రేంజ్ పెరిగిన మాట వాస్తవం. ఓటీటీల రూపంలో నాని సినిమాలకు మంచి డబ్బులు వస్తున్నాయి. పైగా ‘పారడైజ్’ లో భారీ యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయి. అవన్నీ ఖర్చుతో కూడినవే. అయితే రూ.200 కోట్ల బడ్జెట్ అనే వార్తల్లో మాత్రం ఎటువంటి నిజం లేదు. నాని కెరీర్లో ఇదే కాస్ట్లీ సినిమా. అందులో డౌటు లేదు. కానీ మరీ 200 కోట్లయితే ఖర్చు పెట్టడం లేదు. అటూ ఇటుగా ఈ సినిమాకు రూ.120 కోట్ల వరకూ బడ్జెట్ కేటాయించారని టాక్. ఓ పది శాతం అటూ ఇటూ కావొచ్చు. అంతకు మించి పెరిగే ప్రసక్తే లేదు. మోహన్ బాబు ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు రూ.5 కోట్ల పారితోషికం ఇచ్చినట్టు వినికిడి. ఆయనకు సంబంధించిన సీన్లు రిచ్ గా తీశారట. మార్చి లో ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ.. ఆ సమయానికి ‘పారడైజ్’ సిద్ధమయ్యే ఛాన్స్ లేదు. ఇప్పటికైతే 60 శాతం షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. ఏప్రిల్ నాటికి షూటింగ్ ఫినిష్ అవుతుంది. మే లేదా జూన్‌లో రిలీజ్ ఉండొచ్చు.
