కుమారి 21 ఎఫ్‌తో అందర్నీ పడేసింది హెబ్బా పటేల్. ఇప్పుడు దాదాపుగా హీరోయిన్ ఓరియెంటెడ్ టైపు సినిమా ఒకటి చేస్తోంది. అదే.. ‘నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్’. భాస్కర్ బండి దర్శకత్వం వహించాడు. అశ్విన్, పార్వతీశం, నోయల్ కథానాయకులుగా నటించారు. టీజర్ బయటకు వచ్చింది. చూస్తుంటే.. ఈ సినిమా ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గానే కనిపిస్తోంది. ముగ్గురు బోయ్ ఫ్రెండ్స్‌ని సెలెక్ట్ చేసుకొని, అందులో ఒకడ్ని ఫైనల్‌గా పెళ్లి చేసుకోవడానికి ఓ మోడ్రన్ అమ్మాయి ఆడిన గేమ్ ఈసినిమా. టీజర్లోనూ అదే చూపించారు. ఉన్న రెండు డైలాగుల్లోనూ హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌ని స్ట్రాంగ్‌గానే వినిపించారు. సినిమా మొత్తం హెబ్బా పటేల్ చుట్టూనే తిరుగుతుందన్న విషయం టీజర్ చూస్తే అర్థమైపోతోంది. హెబ్బా కూడా గ్లామరెస్గానే కనిపిస్తోంది.
కాన్సెప్ట్‌ని పక్కన పెడితే… హెబ్బా క్యారెక్టరైజేషన్ క్లిక్ అయితే… ఈ సినిమా హిట్టయిపోడం ఖాయం. బెక్కం వేణుగోపాల్ నిర్మించిన సినిమా చూపిస్త మావకి పనిచేసిన టీమే.. దీనికీ వర్క్ చేస్తోంది. అంతేకాదు.. ఈ సినిమా వెనుక దిల్‌రాజు హ్యాండ్ ఉంది. కథ నచ్చి.. ఈ సినిమాలో పార్టనర్ అయిపోయాడాయన. సో… మనం కూడా ఈ సినిమాని నమ్మేయొచ్చు. డిసెంబరు 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కుమారి 21 ఎఫ్‌తో యంగ్ హీరోయిన్ రేసులోకి దూసుకొచ్చిన హెబ్బా.. ఈసారి కథానాయికగా ఎన్ని మెట్లు ఎక్కుతుందో చూడాలి.