ఆంధ్రప్రదేశ్‌లో 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధం విధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చిన్నారుల మానసిక ఆరోగ్యం , ఆన్లైన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని, 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఐటీ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఆస్ట్రేలియా ప్రభుత్వం అమలు చేసిన సోషల్ మీడియా బ్యాన్ నమూనాను ఏపీలో కూడా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.
ఇంటర్నెట్లో దొరికే సమాచారాన్ని విశ్లేషించేంత పరిణతి చిన్న వయసులో ఉండదని, ఇది వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత కాలంలో సైబర్ బుల్లీయింగ్, అశ్లీలత , సోషల్ మీడియా వ్యసనం వల్ల చిన్నారులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. తాము చూస్తున్న కంటెంట్‌ను సరైన సందర్భంలో అర్థం చేసుకునే సామర్థ్యం పిల్లలకు ఉండదని, అందుకే ఒక నిర్దిష్ట వయస్సు వచ్చే వరకు వారిని ఈ ప్లాట్‌ఫారమ్‌లకు దూరంగా ఉంచడం మేలని మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు. గ్లోబల్ మోడల్స్‌ను పరిశీలించడం ద్వారా, రాష్ట్రంలో చిన్నారుల కోసం పటిష్టమైన ఆన్లైన్ సేఫ్టీ నిబంధనలను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నిషేధాన్ని అమలు చేయడం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారనుంది. పిల్లల వయస్సును నిర్ధారించే ఏజ్ వెరిఫికేషన్ టెక్నాలజీని ఎలా వాడాలి, సోషల్ మీడియా సంస్థలు ఈ నిబంధనలను పాటించేలా ఎలా ఒత్తిడి తీసుకురావాలి అనే అంశాలపై ఐటీ శాఖ కసరత్తు చేస్తోంది. కేవలం చట్టం మాత్రమే కాకుండా, తల్లిదండ్రులలో అవగాహన కల్పించడం , ప్రత్యామ్నాయ విద్యాపరమైన కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారానే ఈ లక్ష్యం నెరవేరుతుందని నిపుణులు చెబుతున్నారు.
