“సవాళ్ల నుంచే అవకాశాలను వెతుక్కోవాలి” అని చంద్రబాబు తరచూ చెబుతుంటారు. ఆ మాటను అక్షరాలా వంటబట్టించుకుని, ప్రత్యర్థులు విసిరిన రాళ్లనే తన విజయానికి పునాదులుగా మార్చుకున్న నాయకుడు నారా లోకేష్. హేళనలను తట్టుకున్నారు.. ప్రధాని మోదీ సైతం అభినందించేంత సామర్థ్యాన్ని చూపిస్తున్నారు.
ప్రణాళికాబద్ధంగా వ్యక్తిత్వ హననం
స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పుచ్చుకుని, ఒక కార్పొరేట్ లుక్‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈ యువకుడిపై ప్రత్యర్థులు ప్రణాళికాబద్ధంగా వ్యక్తిత్వ హననం చేశారు. నీటుగా ఉండే ఆయన వేషధారణను చూసి పప్పు అని ముద్రవేసి అవహేళన చేశారు. రాజకీయాల్లోకి వస్తారో లేదో తెలియని వయసు నుంచే మొదలైన ఆ విష ప్రచారాన్ని లోకేష్ నిశ్శబ్దంగా భరిస్తూ వచ్చారు. ఆ సమయంలో సొంత పార్టీలో కూడా ఒకానొక దశలో ఆయన నాయకత్వంపై సంశయాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఆ అవమానాలే ఆయనలో మొండితనాన్ని, పట్టుదలను పెంచాయి.
సవాల్‌గా తీసుకుని ముందడుగు వేసిన లోకేష్
అలాంటి పరిస్థితి పార్టీ ఓటమి తర్వాత మళ్లీ గెలిపించే బాధ్యత తీసుకున్నారు. పార్టీని గాడిలో పెట్టారు. పాదయాత్ర చేశారు. చంద్రబాబును సీఎంను చేశారు. నవ్విన నాపచేనే పండుతుందన్నట్లుగా.. ప్రతి ఒక్కరికీ తన సామర్థ్యం చూపించారు. ఓడిన చోటే స్వయంగా 90వేలకు పైగాఓట్ల మెజార్టీతో గెలిచారు. ఒకప్పుడు ఆయనపై కామెడీ చేసిన వాళ్లు ఇప్పుడు…. వణికిపోతున్నారు. రెడ్ బుక్ అంటే.. కిందా మీద పడిపోయారు. ఎంతో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నవారు.. లోకేష్ దెబ్బకు ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నవ్విన నాపచేనే పండుతుంది అన్న సామెతను నిజం చేస్తూ, తనను ఎగతాళి చేసిన వారందరూ అవాక్కయ్యేలా యువగళం పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కేడర్‌లో ధైర్యం నింపి, గెలుపు గుర్రం ఎక్కించడంలో లోకేష్ వ్యూహకర్తగా మారారు.
జోకులేసిన వాళ్లు వణికిపోతున్నారు !
ఒకప్పుడు ఆయనను చూసి నవ్విన వాళ్లే, నేడు ఆయన పేరు వింటే వణికిపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఆయన రెడ్ బుక్ వ్యూహం ముందు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న హేమాహేమీలు సైతం నేడు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం లోకేష్ కేవలం ఒక మంత్రి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్ ఆశాకిరణం. ఏపీ యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా, ప్రపంచ దేశాలను చుట్టి పెట్టుబడులను ఆకర్షించడంలో నిమగ్నమయ్యారు. దావోస్ వంటి అంతర్జాతీయ వేదికలపై ఆయన చేస్తున్న విశ్లేషణలు, పెట్టుబడిదారులతో జరుపుతున్న చర్చలు ఏపీకి కొత్త పెట్టుబడుల వెల్లువను తెస్తున్నాయి. ఆయన పనితీరు ప్రధాని మోదీని కూడా మెప్పించింది.
ఏపీ యువతకు 20 లక్షల ఉద్యోగాలే టార్గెట్
అటు మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే, ఇటు పార్టీ క్యాడర్‌కు ఏ చిన్న ఆపద వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. అందుబాటులో లేరు అన్న మాట రాకుండా నిరంతరం ప్రజలతో మమేకమవుతూ దూసుకుపోతున్నారు. అవమానాల పొరలను చీల్చుకుని, ఆత్మవిశ్వాసంతో ఎదిగిన లోకేష్.. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ను అద్భుతమైన ప్రగతి పథంలో నడిపిస్తారని ప్రజలు నమ్ముతున్నారు.
హ్యాపీ బర్త్ డే లోకేష్