ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరులో వేగం మరోసారి ప్రజల్ని ఆశ్చర్యపరిచింది. మైలవరం నియోజకవర్గం, తారకరామా నగర్ మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను సీరియస్ గా తీసుకున్న ఆయన, ఎవరికీ ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా పాఠశాలను తనిఖీ చేశారు. స్వయంగా విద్యార్థులతో కలిసి కూర్చుని, వారికి వడ్డిస్తున్న భోజనాన్ని రుచి చూశారు. గత పాలకుల మాదిరిగా కేవలం పర్యటనలతో సరిపెట్టకుండా, అక్కడికక్కడే కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
భోజన నాణ్యతపై నిర్లక్ష్యం వహించినందుకు గాను పాఠశాల హెడ్ మాస్టర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించడమే కాకుండా, సదరు వంట ఏజెన్సీని తక్షణమే తొలగిస్తూ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. పిల్లలకు పెట్టే అన్నంలో నాణ్యత లేకపోతే సహించే ప్రసక్తే లేదు అని స్పష్టం చేసిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో ఎక్కడైనా లోపాలు కనిపిస్తే సంబంధిత అధికారులపై వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఈ తక్షణ చర్యలు క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను సరిదిద్దడమే కాకుండా, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
నారా లోకేష్ చేపట్టిన ఈ ఆకస్మిక తనిఖీలు, తీసుకున్న కఠిన నిర్ణయాలపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల అసంతృప్తిని తెలుసుకుని స్పందించడమే కాకుండా, క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని స్వయంగా సమీక్షించి పరిష్కారం చూపడం ఆయన పనితీరు ప్రత్యేకత. సోషల్ మీడియాలో సైతం నెటిజన్లు లోకేష్ చర్యను అభినందిస్తున్నారు.
