బెంగళూరులో మౌలిక సదుపాయాలు, సమస్యలపై స్టార్టప్స్ యజమానులు వ్యక్తం చేస్తున్న అసంతృప్తిని ఏ మాత్రం మొహమాటం లేకుండా నారా లోకేష్ రాష్ట్రం కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిని ఏపీకి ఆహ్వానిస్తున్నారు. ఇది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులకు ఇబ్బందికరంగా మారింది. వారు లోకేష్‌కు కౌంటర్ ఇవ్వడానికి పెద్ద కసరత్తే చేస్తున్నారు.
తాజాగా మాధ్యూఫిలిప్ అనే వ్యక్తి బెంగళూరులో నార్త్ సైడ్ కొత్తగా అభివృద్ధి చెందుతోందని.. మరింతగా ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని లెక్కలతో ట్వీట్ పెట్టారు. బెంగళూరు నార్త్ అంటే అనంతపురం శివారు వస్తుంది. అందుకే నారా లోకేష్ ఈ ట్వీట్‌కు స్పందించారు. నార్త్ చాలా మంచిదేనని.. కొంచెం సమీపంలో అనంతపురం ఉందని.. అక్కడ కూడా పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చన్నారు. మంచి ప్రోత్సాహకాలు, ఎకోసిస్టమ్ ఉన్నాయన్నారు.
ఈ ట్వీట్‌కు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. బెంగళూరు గొప్పతనం గురించి చాలా పెద్ద ట్వీట్ పెట్టారు. తమ ప్రభుత్వం గొప్పగా దూసుకెళ్తోందన్నారు. బలహీన ఎకోసిస్టమ్‌లను బలమైన ఎకోసిస్టమ్‌లు పోషిస్తాయన్నట్లుగా ట్వీట్ పెట్టారు. కర్ణాటక ఓవర్ ఫ్లోను ఏపీ కోరుకుంటోందని ఆయన కించ పరచే ప్రయత్ం చేశారు. దానికి నారా లోకేశ్ ఏ మాత్రం ఆవేశపడలేదు. యంగెస్ట్ స్టేట్ అయిన ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడానికి, యువతకు ఉద్యోగాలు కల్పించడానికి అన్ని అవకాశాలనూ వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. అహంకారం పనికి రాదని సుతిమెత్తగా సలహా ఇచ్చారు.
అంతకు ముందు బ్లాక్‌బక్ అనే కంపెనీ సీఈవో చేసిన ట్వీట్‌కు లోకేష్ స్పందిస్తే.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫీలయ్యారు. రోడ్లపై గుంతలు అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. కానీ ప్రజా సమస్యలను హంబుల్ గా స్వీకరించి పరిష్కరించాలి కానీ ఇలా బ్లాక్ మెయిల్ చేయకూడదని అన్నారు. మొత్తంగా బెంగళూరులో ఉన్న మౌలిక వసతుల సమస్యలపై అక్కడి సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్లలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు నారా లోకేష్ ఏ మాత్రం తగ్గడం లేదు.