నారా లోకేష్ ఢిల్లీ వెళ్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయన ఢిల్లీ పర్యటన ఉండే అవకాశం ఉంది. అధికారికంగా రాష్ట్ర అంశాలపై చర్చలు జరుపుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ సారి టూర్ లో రాజకీయ అంశాలు కూడా హైలెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
రాష్ట్రంలో చాలా అంశాలపై దర్యాప్తులు జరుగుతున్నాయి. వాటిలో బయట పడిన అంశాలతో పాటు.. తీసుకోవాల్సిన చర్యల విషయంలోనూ ఆయన కేంద్ర పెద్దలతో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాజకీయంగా జరిగే పరిణామాలు, ఇతర అంశాలపైనా మాట్లాడే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. ముఖ్యంగా లిక్కర్ స్కాం అంశంలో సూత్రధారిని అరెస్టు చేసే అంశంపై లోకేష్ తదుపరి రాజకీయ కార్యాచరణ ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
లిక్కర్ స్కాంలో ఇప్పటికే విదేశీ లింకులు కూడా వెలుగులోకి వచ్చాయి. సిట్ వాటన్నింటినీ బయటకు తీసింది. ఈడీ కూడా అంతర్గతంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోంది. అన్నీ బయటకు తీస్తోంది. వందల కోట్ల నల్లధనం ఎలా విదేశాలకు తరలిపోయాయి..ఎలా తిరిగి వచ్చాయన్నదానిపై లెక్కలు తీశారు. అలాగే ఇసుకతో పాటు ఇతర స్కామ్లపైనా దర్యాప్తు నివేదికలు రెడీగా ఉన్నాయి.
బహిరంగంగా జరిగిన అవినీతిపై చర్యలు తీసుకునే విషయంలో రాజకీయంగానూ కొన్ని జాగ్రత్తలుతీసుకోవాల్సి ఉంటుంది. ఆ బాధ్యత నారా లోకేష్ తీసుకున్నట్లుగా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.