ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల అవకాశాల కేంద్రంగా మార్చాలన్న మంత్రి నారా లోకేష్ ముందుచూపుతో మరో భారీ ప్రాజెక్టు రాష్ట్రానికి తరలివచ్చింది. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ప్రపంచంలోనే మొట్టమొదటి ‘అటానమస్ మారిటైం షిప్ యార్డు’కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేస్తున్నారు. సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు, అత్యాధునిక సాంకేతికతతో కూడిన నౌకల నిర్మాణానికి చిరునామాగా మారబోతోంది.
భవిష్యత్తు అవసరాలను గుర్తించి, సముద్ర తీర ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా మార్చాలన్న లోకేష్ కృషితోనే ఈ ప్రాజెక్టు సాకారమవుతోంది. ఈ మారిటైం షిప్ యార్డ్ ఏర్పాటు కేవలం పరిశ్రమ స్థాపన మాత్రమే కాకుండా, దేశ రక్షణ , రవాణా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది. మనుషుల ప్రమేయం లేకుండా స్వయంచాలితంగా పనిచేసే నౌకలను ఇక్కడ తయారు చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి అత్యాధునిక యార్డు మరెక్కడా లేదు.
ఏపీకి ఉన్న సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతాన్ని పారిశ్రామికంగా వాడుకోవడంలో మంత్రి లోకేష్ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాలు ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తున్నాయి. సాగర్ డిఫెన్స్ వంటి అగ్రశ్రేణి సంస్థ ఇక్కడ పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర పారిశ్రామిక వాతావరణంపై ఉన్న నమ్మకానికి నిదర్శనం.
జువ్వలదిన్నెలో రానున్న ఈ షిప్ యార్డ్ ద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
కేవలం ఐటీ రంగమే కాకుండా, తయారీ , రక్షణ రంగాల్లోనూ ఏపీని అగ్రస్థానంలో నిలపాలన్న లోకేష్ లక్ష్యం ఈ ప్రాజెక్టుతో మరో అడుగు ముందుకు పడింది. నేటి శంకుస్థాపన అనంతరం యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి, ప్రపంచ స్థాయి నౌకల తయారీని ఇక్కడి నుంచే ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.