జగన్ రెడ్డి హయాంలో ఓ డిస్టిలరీ నాలుగు వందలకేజీల బంగారం కొనుగోలు చేసింది. లిక్కర్ బంగారంతో తయారు చేయరు కదా.. ఆ బంగారం ఎక్కడికి చేరిందో.. త్వరలో బయటకు వస్తుందని నారా లోకేష్ అన్నారు. సింగపూర్ పర్యటన గురించి వివరించేందుకు అమరావతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు. పక్కా ఆధారాలతోనే లిక్కర్ స్కాం దర్యాప్తు జరుగుతోందన్నారు. లిక్కర్ సరఫరా చేసిన ఓ డిస్టిలరీ కంపెనీలు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన బంగారం కొనుగోలు చేసిందని తెలిపారు. అది ఎక్కడికి చేరిందో బయటకు రావాల్సి ఉందన్నారు.
లిక్కర్ స్కామ్లో సొమ్ము పెద్దిరెడ్డి ఖాతాలకు చేరిందన్నారు. కాదని పాపాల పెద్దిరెడ్డి చెప్పాలని సవాల్ చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఓ వ్యక్తి.. అక్కడి ప్రభుత్వానికి మెయిల్ చేశారన్నారు. త్వరలో ప్రభుత్వం మారుతుందని ఎవరూ పెట్టుబడులు పెట్టవద్దని ఆ మెయిల్ లో ఉందన్నారు. ఆ మెయిల్ చేసింది ఎవరా అని ఆరా తీస్తే పెద్దిరెడ్డి కంపెనీలో పని చేసే వ్యక్తి అని తేలిందన్నారు. రాష్ట్రంపై ఇలా కుట్రలు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. చంద్రబాబుపై సింగపూర్ ప్రభుత్వానికి గౌరవం ఉందని.. అందుకే పెట్టుబడులకు ముందుకు వచ్చారని తెలిపారు.
తెలంగాణలో బకనచర్ల అంశంపై జరుగుతున్న రాజకీయాలపై నారా లోకేష్ గట్టిగా స్పందించారు. కాళేశ్వరం కడుతున్నప్పుడు ఎలాంటి అనుమతులు ఉన్నాయని లోకేష్ ప్రశ్నించారు. దిగువ రాష్ట్రం ప్రాజెక్టులు కట్టుకుంటే ఎగువ రాష్ట్రానికి ఎలా నష్టం జరుగుతుందని .. అక్కడ అంతా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టుకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు.