ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేద ప్రజల పట్ల తనకున్న చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నారు. గతేడాది రంజాన్ మాసంలో మంగళగిరి నియోజకవర్గంలోని షేక్ షహెన్షా అనే పేద ముస్లిం ఇంటికి వెళ్లిన సమయంలో, వారి దయనీయ స్థితిని చూసి చలించిపోయిన లోకేష్.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని నాడు హామీ ఇచ్చారు. శిథిలావస్థలో ఉన్న రేకుల షెడ్డు స్థానంలో పక్కా ఇల్లు నిర్మించి ఇస్తానని ఇచ్చిన మాటను, ఏడాది తిరగకముందే నెరవేర్చి తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజమే అయినా, వాటిని తు.చ తప్పకుండా అమలు చేసి చూపడంలో లోకేష్ చూపిస్తున్న వేగం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది.
షహెన్షా కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందు ఆరగించిన నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూనే, ఆ కుటుంబం ఆశించిన విధంగా అన్ని వసతులతో కూడిన నూతన గృహాన్ని నిర్మించి అందజేశారు. ఒక సామాన్య కార్యకర్త, పేద కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించడమే కాకుండా, వారి జీవితాల్లో వెలుగులు నింపేలా శాశ్వత పరిష్కారం చూపడం లోకేష్లోని నాయకత్వ లక్షణాలకు అద్దం పడుతోంది. పవిత్ర రంజాన్ మాసంలో ఇచ్చిన మాటను, మళ్ళీ అదే మాసం నాటికి నెరవేర్చడం ఆ కుటుంబానికి మంత్రి ఇచ్చిన గొప్ప కానుకగా నిలిచింది.
మంత్రి లోకేష్ తీసుకున్న ఈ చొరవపై మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మైనార్టీ సోదరుల పట్ల ఆయనకు ఉన్న గౌరవం, ప్రేమ ఈ ఘటనతో మరోసారి రుజువయ్యాయని స్థానికులు కొనియాడుతున్నారు. కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా, వ్యక్తుల కష్టాలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించే లోకేష్ తీరు.. నవతరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తోంది. మాట ఇస్తే మడమ తిప్పని నేతగా లోకేష్ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు.
