అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వహణకు ఆర్థికపరమైన సమస్యలు వచ్చాయి. ఈ సంస్థకు ఎఫ్ఆర్సీఏ లైసెన్స్ సస్పెండ్ అయింది. దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది విదేశాల నుంచి ఈ సంస్థకు వస్తాయి. ఈ సంస్థ అనంతపురం జిల్లాలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దశాబ్దాల కిందటే ఫెర్రర్ కుటుంబీకులు ఇక్కడ సేవలు ప్రారంభించారు. వారిపై ఎలాంటి ఆరోపణలు లేవు. కానీ నిధులను విదేశాల నుంచి విరాళాల రూపంలో స్వీకరించే క్రమంలో కొన్ని తప్పిదాలు జరగడం.. వాటికి సరైన సమాధానాలు చెప్పలేకపోవడంతో .. స్వచ్చంద సంస్థలు విదేశాల నుంచి విరాళాలు సేకరించడానికి అవసరమైన FCRA లైసెన్స్ పునరుద్ధరణ కాలేదు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశాల నుంచి వచ్చే విరాళాలపై కఠిన నిబంధనలు పెట్టారు. వారు మత మార్పిళ్లు, దురుద్దేశ కారణాలు, భారత పేదదేశమని జాలి చూపించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానించారు. అదే సమయంలో ఈ విరాళాలు చాలా అక్రమ మార్గంలో వస్తున్నాయని..సరైన లెక్కలు కూడా ఉండటం లేదని అనుమానించారు. అందుకే నిధులు స్వీకరించడానికి అవసరమైన లైసెన్స్ నిబంధనలను కఠినం చేశారు. ఇలాంటి స్వచ్చంద సంస్థలు చాలా వరకూ ఇండియాను వదిలి వెళ్లిపోయాయి. చాలా వాటిలో కార్యకలాపాలు తగ్గిపోయాయి. అలాంటి వాటిలో అనంతపురం ఆర్డీటీ ఒకటి.
ఇప్పుడు ఆ సంస్థ నిధులు ఖర్చు చేయలేకపోవడంతో.. వారు స్థాపించిన ఆస్పత్రులు, విద్యాసంస్థలు నిర్వహించడం భారంగా మారింది. అందుకే నారా లోకేష్ రంగంలోకి దిగారు. ఆర్డీటీ సేవలు లక్షలాది పేదల బతుకుల్లో వెలుగులు నింపాయి. అనతంపురం జిల్లా ప్రజలకు చాలా సేవలు చేశారు. అటువంటి సంస్థకు తాత్కాలికంగా ఇబ్బందులు వచ్చాయని..వాటిని శాశ్వతంగా పరిష్కరించి ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటాని భరోసా ఇస్తున్నారు. ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇదివరకే సంప్రదించామని. ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామన్నారు.
FCRA నిబంధనల ఉల్లంఘన విషయంలో ఆర్డీటీ సంస్థ చేసిన పొరపాట్లను మొదటి తప్పుగా భావించి.. చర్యలు నిలిపివేయాలని.. లైసెన్స్ పునరుద్ధరణ చేయాలని ముఖ్యమంత్రి కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇంటలిజెన్స్ రిపోర్ట్ వచ్చాక నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెబుతోంది. త్వరలో కేంద్రం లైసెన్స్ జారీ చేసే అవకాశం ఉంది.
