కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు నారా లోకేష్ ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఆ ఫీడ్ బ్యాక్ ను సమగ్రంగా ఓ వేదిక కిందకు తీసుకు రావాలని నిర్ణయించి కొత్త ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. క్షేత్రస్థాయిలో పార్టీ జెండాను మోసే సామాన్య కార్యకర్త మనోభావాలకు పట్టం కట్టడమే ధ్యేయంగా అధినాయకత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. పార్టీ యంత్రాంగానికి, కార్యకర్తలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి, నేరుగా వారి సూచనలను స్వీకరించేందుకు మంత్రి నారా లోకేష్ ఫీడ్బ్యాక్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఫీడ్ బ్యాక్ కమిటీ ఏర్పాటు
మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ కేవలం ఫిర్యాదుల స్వీకరణకే పరిమితం కాకుండా, కార్యకర్తల ప్రతి ఆలోచనను నేరుగా నాయకత్వానికి చేరవేసే ఒక శక్తివంతమైన వారధిలా పనిచేయనుంది. మారుతున్న కాలంతో పాటు పార్టీలోనూ సంస్కరణలు అవసరమని గుర్తించిన టీడీపీ, సోషల్ మీడియా యుగంలో కార్యకర్తల స్పందనలను నిర్మాణాత్మకంగా మార్చాలని భావిస్తోంది. పార్టీ పట్ల ఉండే అసంతృప్తి లేదా సూచనలను బహిరంగ వేదికలపై కాకుండా, పార్టీ అంతర్గత వేదికలపై చర్చించేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దారు.
అంతర్గత విషయాలు సోషల్ మీడియాలో కాకుండా నేరుగా పార్టీకే చెప్పుకునే అవకాశం
ఫీడ్ బ్యాక్ కమిటీ వల్ల ప్రత్యర్థి పార్టీలకు విమర్శించే అవకాశం ఇవ్వకుండా, ఇంటి గుట్టు ఇంట్లోనే సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కలగడమే కాకుండా, కార్యకర్తల్లో తాము కూడా నిర్ణయాధికారంలో భాగస్వాములమనే నమ్మకం బలపడుతుంది. యువ నాయకత్వంలో టీడీపీ సరికొత్త పుంతలు తొక్కుతోంది. కార్యకర్తల కష్టసుఖాలను పంచుకోవడంలోనే కాకుండా, వారి సలహాల ద్వారా పార్టీ విధానాలను మెరుగుపరుచుకోవడంలో నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం లేదా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా అమలు అవుతున్నాయి? ప్రజల స్పందన ఎలా ఉంది? అనే అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఏర్పడుతుంది.
సమస్యలన్నీ పై స్థాయి వరకూ వెళ్లే అవకాశం
ఈ ఫీడ్బ్యాక్ యంత్రాంగం కేవలం ఎన్నికల కోసం మాత్రమే కాకుండా, నిరంతర ప్రక్రియగా కొనసాగడం పార్టీని మరింత బలోపేతం చేస్తుంది. ఈ కమిటీ ఏర్పాటుపై పార్టీ శ్రేణుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. తమ గళాన్ని నేరుగా అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ వరకు చేరవేసే మార్గం సుగమం కావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. పార్టీ అధిష్టానం తమ మాటకు విలువ ఇస్తుందని, తమ సమస్యలను తీర్చడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
