నవంబర్‌లో జరగనున్న పెట్టుబడుల సదస్సు కోసం చంద్రబాబు, నారా లోకేష్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ కు ఆహ్వానించిన నారాలోకేష్.. ఈ సారి ఆస్ట్రేలియా వెళ్తున్నారు. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరపున ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఇటీవల మంత్రి లోకేష్ కు ఆహ్వాన లేఖను పంపారు.
మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఈ మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ ను కోరింది. ఇందులో భాగంగా మంత్రి లోకేష్ ఈ నెల 19-24నడుమ ఆస్ట్రేలియాలోని వివిధ యూనివర్సిటీలను సందర్శించి అక్కడి అధునాతన విద్యావిధానాలపై అధ్యయనం చేస్తారు. దీంతోపాటు నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ విజయవంతం చేయాలని కోరుతూ రోడ్ షోల్లో పాల్గొంటారు. 19వ తేదీ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. 20వ తేదీ NSW పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో నిర్వహించే సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు.
23వ తేదీ వి యర్రా వ్యాలీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైన్ ఇండస్ట్రీని సందర్శించి, అనంతరం ట్రెజరీ వైన్స్ ఎస్టేట్ ప్రతినిధులతో సమావేశమవుతారు. 24వ తేదీ రాత్రి మెల్బోర్న్ నుంచి బయలుదేరి 25వ తేదీ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా నవంబర్‌లో మొదటి వారంలో లండన్‌కు వెళ్లనున్నారు. గూగుల్ ఏఐ హబ్‌తో ప్రపంచవ్యాప్తంగా పేరు రావడంతో ఆ ఇమేజ్ను వాడుకుని మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలని చంద్రబాబు, లోకేష్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.