ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేష్ పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. లోకేష్ భేటీ అయిన కేంద్ర మంత్రుల్లో విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా ఉన్నారు. ఇతర కేంద్ర మంత్రులు అయితే ..రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి మాట్లాడతారు. మరి విదేశాంగ మంత్రితో ఏం చర్చించి ఉంటారు ?. విదేశాంగ మంత్రితో సమావేశం ఏపీ రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది.
టీడీపీ వర్గాలు అధికారికంగా చెప్పిన దాని ప్రకారం.. విదేశాల నుంచి రావాల్సిన వివిద పెట్టుబడులకు సంబంధించి ఉన్న ఆటంకాలపై చర్చించారు. గూగుల్ డేటాసెంటర్, మిట్టల్ స్టీల్ ప్లాంట్ సహా ఇతర దేశాల నంచి పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఏపీకి రావాల్సి ఉంది. వీటికి సంబంధించిన క్లియరెన్స్ ల కోసం లోకేష్ కలిశారని చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో రాజకీయంగానూ మరో రకమైన ప్రచారం జరుగుతోంది.
లిక్కర్ స్కామ్లో చాలా వరకూ నిధులు విదేశాలకు తరలి పోయాయి. అక్కడి నుంచి వైట్ రూపంలో తిరిగి తెచ్చుకున్నారు. వీటన్నింటిపై దుబాయ్ సహా పలు ప్రాంతాలకు సిట్ అధికారులు వెళ్లి ఆధారాలతో తిరిగి వచ్చారు. అధికార మార్గాల్లో ఇలాంటి సమాచారం అంతా సేకరించేందుకు లోకేష్ విదేశాంగ మంత్రిత్వశాఖ ద్వారా ప్రయత్నిస్తున్నారు. లిక్కర్ కేసులో ఎక్కువగా బయట లింకులు ఉన్నాయి కాబట్టి.. లోకేష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
లోకేష్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా వైసీప నేతలకు టెన్షనే. చంద్రబాబునాయుడు ఢిల్లీకి వచ్చే ముందు ఒక రోజు ముందే నారా లోకేష్ ఢిల్లీ వచ్చి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కావడం చిన్న విషయం కాదని వారు అలర్టవుతున్నారు.