ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసిందేమో కానీ పదవులు రాలేదని అసంతృప్తితో ఉన్న వారందర్నీ గుర్తించి సలహాదారు పోస్టు ఇచ్చేస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే వారానికొక సలహాదారును నియమిస్తున్నారు. ఒక్కొక్కరికి.. మూడు..నాలుగు లక్షల ప్రజాధనాన్ని ఇస్తున్నారు. తాజాగా.. వైసీపీ అధికార ప్రతినిధి పేరుతో మీడియా ముందుకు వచ్చి విపక్ష నేతల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టే నారమల్లి పద్మజ అనే నాయకురాలికి సలహాదారు పదవి ఇచ్చేశారు.
ఇక్కడ జగన్ సామాజిక న్యాయం పాటించారు. నారమల్లి పద్మజ భర్త పేరు ఏజే సుబ్రహ్మణ్యం రెడ్డి . నారమల్లి పద్మజను మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగ, వృద్ధుల విభాగానికి సలహాదారుగా నియమించారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఏఆర్ అనూరాధ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో అనూరాధ స్పష్టం చేశారు. ఈ మేరకు పద్మజతో పాటు సంబంధిత విభాగాలకు కూడా ఉత్తర్వుల కాపీని పంపించారు.
కాంగ్రెస్‌లో ఉండే నారమల్లి పద్మజను జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం పని చేశారు. అయితే గత నాలుగేళ్లుగా ఆమె పదవి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి వారందరికీ ఏదో ఓ పదవి ఉంటే.. కనీసం అసంతృప్తి వ్యక్తం చేయకుండా ఉంటారని పదవుల పంపకాన్ని జగన్ పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే 80 మంది వరకూ సలహాదారులు ఉంటారు. ఇక ముందు కూడా ఈ నియామకాల పరంపర కొనసాగే అవకాశం ఉంది.