పిఠాపురంలో వర్మను జీరో చేశామంటూ నారాయణ ఆడియో వైరల్ అయింది. దానిపై వర్మ కూడా కూడా స్పందించారు. ఎవడో ఏదో అంటే తాను తాను జీరో కాదన్నట్లుగా మాట్లాడారు. ఈ ఇద్దరు నేతల మధ్య వివాదానికి వెంటనే పులిస్టాప్ పడింది. విశాఖ పర్యటనకు వచ్చిన నారాయణను వర్మ కలిశారు. వారి ఆడియోపై చర్చ జరిగింది. తర్వాత వారు మీడియాతో మాట్లాడారు.
టెలీ కాన్ఫరెన్స్ లో నేను మాట్లాడిన మాటలను కట్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని పిఠాపురంలో జనసేన,టీడీపీ ద్వితీయ శ్రేణి మధ్య ఉన్న విభేదాలను చర్చించి “జీరో” చేశామని నేను చెప్పానని నారాయణ క్లారిటీ ఇచ్చారు. కంటెంట్ మొత్తం బహిర్గతం చేసి ఉంటే వక్రీకరణలు ఎలా జరిగాయో అర్థం అయ్యేదన్నారు. వక్రీకరించి విభేదాలు సృష్టించడం ఎవరి వల్ల కాదని స్పష్టం చేశారు. ఇండిపెండెంట్ గా 50 వేల ఓట్లతో గెలిచిన బలమైన నాయకుడు వర్మ.. పిఠాపురంలో జనసేన,టీడీపీ సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయిని స్పష్టం చేశారు.
చంద్రబాబు ఆగమంటే ఆగుతాను…దూకమంటే దూకుతానని వర్మ అన్నారు. నారాయణ వ్యాఖ్యలపై అభూత కల్పనలు ప్రచారం చేశారని.. పేటీఎం బ్యాచ్ చేసే అసత్య ప్రచారాలను నేను పట్టించుకోనని వర్మ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో నేను పిల్లర్ లాంటి వాడిని .. మంత్రి నారాయణ జనసేన, టీడీపీ మధ్య కాకినాడ జిల్లాలో వారధిగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. కూటమి మధ్య విబేధాలు సృష్టించడం ఎవరి వల్ల కాదన్నారు.
కూటమి మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. కోవర్టుల ద్వారా అంతర్గత ఆడియోలు సంపాదించి వక్రీకరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. అయితే టీడీపీ, జనసేన నేతలు ఎప్పటికప్పుడు వాటిని బద్దలు కొడుతున్నారు.