వైసీపీ ప్రభుత్వంలో తీవ్రంగా వేధింపులకు గురైన వారిలో నారాయణ ఒకరు. కానీ ఆయన ఇప్పుడు వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై మాత్రం చూసీచూడనట్లుగా పోతున్నారు. తాను చేపట్టిన శాఖలో వేల కోట్ల అవినీతి జరిగిందని దానికి ఓ ఐఏఎస్ బాధ్యురాలని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించినా ఆయన పట్టించుకోవడం లేదు. ఆరోపణలపై విచారణ చేయించడం లేదు. దీంతో నారాయణ ఎందుకిలా అన్న చర్చ టీడీపీలోనే వినిపిస్తోంది.
హార్డ్ వర్క్ నారాయణ
మాస్టారు నారాయణ అంటే టీడీపీలో అందరికీ గౌరవమే. ఆయన కష్టపడే విధానం అలా ఉంటుంది. ఆయనకు నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టినా సరిపోదని ఆయన వేగాన్ని అందుకోలేరని అంటూ ఉంటారు. అమరావతి పనుల్ని ఆయన నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా.. అనేక సంస్కరణలు చేపట్టారు. అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. అందుకే ఆయన అంటే ముఖ్యమంత్రి కూడా అభిమానం చూపిస్తారు.
జరగని అవినీతిపై నారాయణపై వైసీపీ హయాంలో వేధింపులు
టెన్త్ క్లాస్ పరీక్షల నిర్వహణలో లోపాలు బయటపడటంతో.. దానికి నారాయణకు లింక్ పెట్టి.. ఆయన ఫోన్ ను ట్యాప్ చేసి.. వైపీఎస్గా రెచ్చిపోయిన రిషాంత్ రెడ్డి అనే పోలీస్ ఆఫీసర్ తో .. హైదరాబాద్ నారాయణను అరెస్టు చేయించారు. అసలు ఆ పేపర్ లీక్ కాలేదు. నారాయణ స్కూళ్లు , కాలేజీల నిర్వహణ, రోజువారీ విషయాలను ఆయన పట్టించుకోరు. కానీ ఓ నారాయణ ఉద్యోగి నుంచి తప్పుడు వాంగ్మూలం తీసుకుని కిడ్నాప్ మాదిరిగా అరెస్టు చేశారు. అంతకు ముందు ఆయనపై జరగని అవినీతిపై ఎన్నో కేసులు పెట్టారు. కానీ ఒక్కటి అంటే ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు.
ఇప్పుడు జరిగిన అవినీతిని పట్టించుకోని నారాయణ
ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ.. వైసీపీ హయాంలో తన శాఖలో జరిగిన అవినీతిపై మాత్రం పట్టించుకోవడంలేదన్న అసంతృప్తి కనిపిస్తోంది. ఐఏఎస్ శ్రీలక్ష్మి నేతృత్వంలో టీడీఆర్ బాండ్ల దగ్గర నుంచి బ్యూటిఫికేషన్ పేరుతో డబ్బులు కొట్టేయడం వరకూ వందల కోట్ల అవినీతి జరిగింది. సభాసంఘం వేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నా ఆయన వద్దంటున్నారు. అవినీతిపై విచారణ వద్దంటున్నారు. వైసీపీ అవినీతిపై విచారణ విషయంలో ఆయన ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారన్నది టీడీపీ నేతలకూ అర్థం కావడం లేదు.