జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించినప్పటి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆయన గురించి చర్చలు మొదలయ్యాయి. తెదేపాకి ఆయన మిత్రుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ వారి గురించి ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యల కారణంగా తెదేపా నేతలు ఆయనపై విరుచుకుపరుడుతున్నారు. కానీ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాత్రం పవన్ కళ్యాణ్ గురించి చాలా భిన్నంగా కొంత సానుకూలంగానే స్పందించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ నిజంగా రాజకీయాలలోకి వచ్చి ప్రజాసేవ చేయాలనుకొన్నట్లయితే సినిమాలు వదిలిపెట్టి తన పూర్తి సమయం రాజకీయాలకి కేటాయించాలి. ఒకవేళ అలా వీలుకాదనుకొంటే రజనీకాంత్ లాగ ఇంట్లో కూర్చొంటే మంచిది. పవన్ కళ్యాణ్ లో కమ్యూనిస్టు భావాలు బాగానే ఉన్నాయి కానీ వాటిని ఆచరణలో పెట్టలేక తడబడుతున్నాడు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు చాలా అసమర్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ విషయంలో అవి మాటలకే పరిమితం అయ్యాయి. అందుకే ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొని ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలలోకి ప్రవేశించినట్లయితే జనసేన పార్టీ తెదేపా, వైకాపాలకి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంది. ఆయన నిలకడగా రాజకీయాలలో ఉండే మాటయితే, మా పార్టీ కూడా జనసేనతో చేతులు కలపడానికి ఆలోచిస్తుంది,” అని నారాయణ అన్నారు.
తెదేపా, భాజపాలు రెండూ తమ హామీలని నిలబెట్టుకోవడంలో విఫలం అయిన కారణంగా ప్రజలలో వాటి పట్ల చాలా అసంతృప్తి నెలకొని ఉన్నమాట వాస్తవం. అయితే వాటికి ప్రత్యామ్నాయం కనబడుతున్న వైకాపా కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతోందని చెప్పక తప్పదు. ఉదాహరణకి ప్రత్యేక హోదాపై తెదేపా, భాజపాలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నప్పుడు, వైకాపా కేంద్రప్రభుత్వంతో గట్టిగా పోరాడి ఉండి ఉంటే, ప్రజలు దానిని ఆదరించేవారు. కానీ ఈవిషయంలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని నిలదీయకుండా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పిస్తూ రాజకీయాలు చేస్తుండటంతో వైకాపా కూడా కేంద్రంతో పోరాడే ధైర్యం లేదని రుజువయింది. కనుక ఆ రెండు పార్టీలకి ప్రత్యామ్నాయంగా మరో పార్టీకి అవకాశం ఉందనే నారాయణ మాట నిజమే. కానీ పవన్ కళ్యాణ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరా లేదా? అనేది కాలమే చెపుతుంది.