అమరావతిపై ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మంత్రి నారాయణ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రోజు అయినా ఆయన అమరావతి మొత్తం ఓ చుట్టూ తిరిగి.. పనులను పర్యవేక్షించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అమరావతి పనులు జరగడం లేదని అంటున్నారని.. ఏసీ గదుల్లో కూర్చుని మాట్లాడుతున్నారని అమరావతి వచ్చిచూసి మాట్లాడాలని అన్నారు. వచ్చే మార్చి కల్లా.. అధికారులు, ఉద్యోగుల ఇళ్లను పూర్తి చేస్తామన్నారు.
ఇప్పుడు అమరావతిలో పదమూడు వేల మంది పనులు చేస్తున్నారు. వచ్చే నాలుగైదు నెలల్లో వీరిసంఖ్య ఇరవై వేలకు చేరుకునే అవకాశం ఉంది. మూడేళ్లలో కోర్ క్యాపిటల్ గా ఇప్పుడు.. అప్పగించిన పనులన్నీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. చేసి చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. లేకపోతే అది వైఫల్యమే అవుతుంది. ఇప్పుడు ఎంత ఫేక్ ప్రచారాలు చేసినా .. ఎక్కువగా స్పందిస్తే వారికి ప్రచారం కల్పించినట్లు అవుతుంది కానీ.. ప్రయోజనం ఉండదు.
పనులు వేగంగా చేసి.. అమరావతికి ఓ రూపం వచ్చేలా చేయడమే ఇప్పుడు ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. ఇన్వెస్టర్లకు, ఇతర స్టేక్ హోల్డర్లకు నెలకు ఓ సారి పనుల పురోగతిపై సమాచారం పంపితే.. ఫేక్ ప్రచారం వల్ల .. వైసీపీ ఎలాంటి ప్రయోజనం పొందలేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున అమరావతికి అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయి.. వచ్చే ఏడాదికి క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో.. వైసీపీ చేసే ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియాలో వీడియోలతో సహా తిప్పికొడితే సరిపోతుంది. ప్రభుత్వం పెద్దలు స్పందిస్తే వారు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది.