మోదీ జేబులో నెహ్రూ బొమ్మ

పార్లమెంట్ లో రాజ్యాంగంపై రెండురోజులపాటు చర్చ జరిగిన సమయంలో `నెహ్రూ బొమ్మవస్తుందా? రాదా?? ‘అన్న టాపిక్ సభలోపల ఉన్న కాంగ్రెస్ పెద్దలకి విపరీతమైన టెన్షన్ పుట్టింది. ఆ టెన్షన్ లో మోదీని విమర్శించి చివరకు పప్పులో కాలేశారు. భారతతొలి ప్రధానమంత్రి, రాజ్యాంగ నిర్మాణసంఘంలో సభ్యుడైన జవహర్ లాల్ నెహ్రూని అధికారపార్టీగా ఉన్న బిజెపీ ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోవడంలేదనీ, ఇదంతా ప్రధాని మోదీ చేస్తున్న కుట్ర అని గతకొద్ది రోజులనుంచీ కాంగ్రెస్ వాళ్లు తెగగుంజుకున్నారు. నెహ్రూ బొమ్మను మసకబారేలా చేయాలన్నదే బిజెపీ లక్ష్యమనీ, అందుకు వ్యూహాత్మకంగా అడుగులువేస్తున్నారనీ, ఈ కారణంగానే రాజ్యాంగ దినోత్సవం అంటూ ప్రత్యేక చర్చ ప్రారంభించి అందులో నెహ్రూపేరు రాకుండా చూడాలని తపనపడుతున్నారన్నది- మొదటిరోజు చర్చ అయినతర్వాత కాంగ్రెస్ వర్గాల నుంచి వచ్చిన ఘాటైన విమర్శ. అయితే మోదీ ప్రసంగంతో ఈ విమర్శ జావగారిపోయింది.

వినూత్న వ్యూహాలతో ముందుకువెళ్ళే మోదీ ఈసారి కూడా ప్రతిపక్షాలవారిని కంగుతినిపించారనే చెప్పాలి. నెహ్రూ పేరు ఎత్తడంలేదంటూ వచ్చిన విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టారు. చర్చలో ప్రధాని పాల్గొంటూ, రాజ్యాంగమన్నది భారతీయులకు ఒక పవిత్ర గ్రంథమంటూ కొనియాడారు. ఈ సందర్బంగానే రాజ్యాంగ రూపకల్పనలో నెహ్రూ పాత్రను ఎన్డీయే తక్కువ చేసి చూస్తున్నదంటూ వచ్చిన విమర్శలను త్రోసిపుచ్చారు. ఆయన తన ప్రసంగంలో పలుమార్లు మహాత్మాగాంధీ, బి.ఆర్. అంబేద్కర్, నెహ్రూ పేర్లను ఉటంకించారు. అలా మోదీ తన జేబులో నుంచి నెహ్రూ బొమ్మనుకూడా తీయడంతో ఒక వివాదానికి తాత్కాలికంగా తెరదింపే ప్రయత్నం చేశారు.

నెహ్రూని మసకబార్చాలన్న ఆలోచన బిజెపీకి ఉన్నదన్న సందేహాలు, అనుమానాలు ఇటీవల కాలంలో బాగా దట్టంగానే పరుచుకున్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న కారణాలను ఎలాగైనా బయటపెట్టి తద్వారా నెహ్రూని ఒక అపరాధిగా, దోషిగా నిలబెట్టాలన్న వ్యూహం కూడా బిజెపీ రచించిందంటూ గుసగుసలు వినిపించాయి. మోదీ ప్రధాని అయిన తర్వాత అనుసరిస్తున్న విధానాలూ, చేపడుతున్న వినూత్న కార్యక్రమాలే నెహ్రూపై బిజెపీ కక్షకట్టిందేమోనన్ని అనుమానాలకు తావిచ్చింది. మోదీ ప్రధానికాగానే ముందుగా, మహాత్మా గాంధీ బొమ్మను బయటకుతీశారు. గాంధీ సిద్దాంతాలను అక్కున చేర్చుకున్నారు. గాంధీ వాడిన కళ్లజోడునే లోగోగా మార్చి స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని గాంధీ జయంతి (అక్టోబర్ 2) రోజునే ప్రారంభించారు. అలాగే, భారతదేశపు తొలి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ బొమ్మను పైకి తీసి పటేల్ ని మహోన్నతమైన వ్యక్తిగా శ్లాఘించారు. విగ్రహావిష్కరణ సభల్లో పాల్గొన్నారు. అక్కడివరకు ఫర్వాలేదు, కానీ అదే సమయంలో నెహ్రూని దుయ్యబట్టారు. ఒక సభలో మోదీ మాట్లాడుతూ, కాశ్మీర్ సమస్య ఇప్పటికి రావణకాష్టంలా మండటానికి కారణం- జవహర్ లాల్ నెహ్రూనే అంటూ వ్యాఖ్యలు చేశారు. `భారత దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదటి ప్రధాని అయ్యుంటే బాగుండేద’ని అన్ని తరాల యువత భావిస్తునే ఉన్నదని అని మోడీ యువతమనోభావాల తరఫన వకల్తా పుచ్చుకున్నారు.

టీచర్స్ డే పట్ల కూడా మోదీ శ్రద్ధచూపెట్టారు. భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజున (సెప్టెంబర్ 5)న ఏటా జరుపుకునే టీచర్స్ డే రోజున పిల్లలతో సందడిచేసి రాధాకృష్ణన్ అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. సరే, ఈమధ్య బీహార్ ఎన్నికలప్పుడు ఆర్ఎస్ఎస్ ద్వారా `రిజర్వేషన్ల విధానం రివ్యూ’ విషయంలో చెలరేగిన దూమారాన్ని అణచివేయడం కోసం బి.ఆర్. అంబేద్కర్ బొమ్మను మోదీ బయటకుతీశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగంపై ప్రత్యేక చర్చకు తెరదీశారు.

మోదీ చాలా వ్యూహాత్మకంగా అడుగులువేస్తున్నారనడానికి ఇంతకంటే నిదర్శనాలు మరేమి కావాలి. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్వేపల్లి రాధాకృష్ణన్…ఇప్పుడు బి.ఆర్.అంబేద్కర్ ని మోదీ బాగా గుర్తుచేసుకున్నారు. బిజెపీ పార్టీ నేతలు కూడా తప్పట్లు తాళాలు వాయించారు. దీన్ని మనమేమీ విమర్శించాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఈ మహానుభావులంతా నవభారత నిర్మాతలే. వీరంతా నిత్యస్మరణీయులే. ఇంతవరకు బాగానేఉంది. కానీ, మరి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని, భారత తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన జవహర్ లాల్ నెహ్రూ పేరును మోదీ స్మరించుకోకపోవడం కాంగ్రెస్ వాదులను కలచివేసింది. నెహ్రూని పొగడకపోతేపోనీ కానీ విమర్శించడం కాంగ్రెస్ వాళ్లకు నచ్చలేదు. ఎక్కడ ఏమాత్రం అవకాశమొచ్చినా నెహ్రూని దుయ్యబట్టడంలో మోదీ ఆరితేరారు. మరో పక్క నేతాజీ మరణంలోని మిస్టరీని బయటకుతీయడం ద్వారా నెహ్రూని కళంకితునిగా మార్చాలన్న కుట్రకూడా చాపక్రిందనీరుగా సాగిపోయిందంటూ- విమర్శలొచ్చాయి.

ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో రాజ్యాంగచర్చ ప్రారంభమైంది. ఇక్కడ కూడా నెహ్రూ బొమ్మ బయటకుతీయకుండానే చర్చ ముగిస్తారని కాంగ్రెస్ నేతలు భావించారు. లోలోపల కుమిలిపోయారు. నెహ్రూ పేరు చెప్పకపోవడం ద్వారా మోదీ తనలోని `అసహనాన్ని’ ప్రదర్శిస్తున్నారంటూ కాంగ్రెస్ భావించింది. తొలి ప్రధానమంత్రి నెహ్రూ, రాజ్యాంగ నిర్మాణంలో చేసిన కృషిని బిజెపీవాళ్లు మరచిపోయారనీ, జర్మన్ రాజ్యాంగం వారికి గుర్తుపెట్టుకోగలరనీ, అక్కడి నియంతని గుర్తుచేసుకోగలిగారనీ, కానీ ఆధునిక భారత నిర్మాతల్లో ఒకరైన నెహ్రూ పేరును స్మరించుకోవడం అధికార పార్టీకి చేతకావడంలేదంటూ ప్రతిపక్ష నేత గులాం నబీ అజాద్ విమర్శించారు.

ఇక్కడితో సీన్ మారిపోయింది. రెండవరోజు చర్చలో ప్రధాని మోదీ ఉన్నట్టుండి నెహ్రూ బొమ్మను కూడా పైకి తీశారు. ఆయన చేసిన సేవలను కూడా కొనియాడారు. గతంలో నెహ్రూని విమర్శించిన ధోరణికి ఇది పూర్తిగా విరుద్ధం. విమర్శకుల నోర్లు మూయించడానికి నెహ్రూ పేరు పదేపదే ప్రస్తావించారా ?, లేక తొలిప్రధాని చేసిన సేవలను మోదీ నిజంగానే స్మరించుకుంటున్నారా ? అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం. ప్రస్తుతం కీలక బిల్లులు ఆమోదంపొందే విషయంలో ఏకాభిప్రాయసాధన కోసం కృషిచేస్తున్న సమయంలో, నెహ్రూ టాపిక్ తో వివాదాన్ని పెద్దది చేయడం ఇష్టంలేక, వ్యూహాత్మకంగా విపక్షానికి మోదీ స్నేహహస్తం చాచినట్లుగానే చెప్పుకోవాలి. అయితే ఏరుదాటగానే తెప్పతగలబెట్టే నైజం ఉన్న వ్యక్తిని ఎలా నమ్మగలం??.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close