నరేష్ – పవిత్ర లోకేష్ భలేటి స్ట్రాటజీ ఫాలో అయ్యారు. తమ వ్యక్తిగత జీవితాన్ని, సినిమాకి ముడి పెడుతూ.. మళ్లీ పెళ్లి సినిమా తీశారు. ఈ సినిమా ప్రమోషన్లలో కూడా స్ట్రాటజీ కనిపించింది. తమ ఇద్దరికీ నిశ్చితార్థం అయ్యిందని చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ తరవాత పెళ్లయిపోయిందంటూ మరో వీడియో బయటపెట్టారు. దాంతో సోషల్ మీడియాలో వీరిద్దరి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తీరా చూస్తే… `మళ్లీ పెళ్లి` సినిమా కోసం ఇదంతా చేశారన్న సంగతి అర్థమైంది. వాళ్ల జీవితాలనే తెరపై చూపిస్తున్న చిత్రం `మళ్లీ పెళ్లి`. తమ వ్యక్తిగత జీవితాన్ని సినిమా కోసం వాడుకొన్నారా? లేదంటే సినిమానే తమ వ్యక్తిగత జీవితం కోసం వాడుకొన్నారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఈ విషయంలో నరేష్ నిజాయతీగానే స్పందించారు.
”నిశ్చితార్థం, పెళ్లి వీటికి సంబంధించిన వీడియోలు అబద్దం కాదు. అలాంటి చీప్ ట్రిక్స్ మేం ప్లే చేయలేదు. ఎలాగూ మా జీవితాల్లో జరిగిన విషయాలే కాబట్టి.. వాటిని నిర్భయంగా బయట పెట్టేశాం. అంతే కాదు.. ఇందులో మేం డ్రామాలేం ఆడలేదు” అన్నారు. అంటే నిశ్చితార్థం, పెళ్లి.. రెండూ నిజాలే అన్నమాట. మైసూర్ హోటెల్ లో పవిత్ర, నరేష్, రమ్యల మధ్య రసవత్తరమైన డ్రామా నడిచిన విషయం గుర్తుండే ఉంటుంది. అక్కడ ఏం జరిగిందో.. సవివరంగా, పూస గుచ్చినట్టు ఈ సినిమాలో చూపించారట. ఆ ఎపిసోడ్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని నరేష్ చెబుతున్నారు. ఈ సినిమాలో దాదాపుగా ఆయనది హీరో పాత్రే. హీరోగా మరో రెండు సినిమాలు ఒప్పుకొన్నానని, అందులో ఒకటి సెట్స్ మీద ఉందని నరేష్ చెప్పారు. ఈ వయసులో మళ్లీ పెళ్లి చేసుకోవడమే కాకుండా.. హీరోగానూ మెరవాలని ఆశ పడుతున్నారన్నమాట. నరేష్ ఘటికుడే.