గాడ్సే అంటే, ఆర్ఎస్ఎస్ ఉలిక్కి ?

విశ్లేషణ

కేంద్రంలో భారతీయజనతాపార్టీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్) కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తున్నది. మరీ ముఖ్యంగా మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్ గాడ్సే పేరు ఎవరైనా ప్రస్తావించగానే ఉలిక్కిపడుతోంది. పాతస్నేహాలు, పాత బంధుత్వాలకు ప్రాధాన్యత ఇస్తే, అధికార బిజెపీకి ఎక్కడ ఇబ్బంది తలెత్తుతుందోనని మనసుచంపుకుని వ్యవహరిస్తున్నట్లుగాఉంది ఆర్ఎస్ఎస్ ధోరణి.

మహాత్మాగాంధీని హత్యచేసినందుకు 1949 నవంబర్ 15న గాడ్సేని అంబాలా జైలులో ఉరితీశారు. ఈ సంఘటన జరిగి 66 సంవత్సరాలైంది. అయితే ఇప్పటికీ గాడ్సేని ఆరాధించేవారు దేశంలో ఉన్నారు. జయంతి, వర్థంతులప్పుడు గాడ్సేని తలుచుకుంటున్నారు. నివాళులర్పిస్తున్నారు. వీరంతా గాడ్సే అనుసరించిన మార్గమే సరైనదని భావిస్తున్నారు. వారి దృష్టిలో గాడ్సే దేవుడు. గుళ్లూ గోపరాలు కట్టించాలని అనుకుంటున్నారు. గాడ్సే భావజాల వ్యాప్తికి ప్రయత్నిస్తున్నారు.

స్వాతంత్ర్యపోరాటాలమేరకు గాడ్సే కూడా గాంధీ ఆలోచనలతో కొన్ని సందర్భాల్లో ఏకీభవించినమాట నిజమే. ఆ తర్వాత గాడ్సే ఆర్ఎస్ఎస్ లో చేరారు. భారత్ – పాకిస్తాన్ విభజనను గాడ్సే వ్యతిరేకించారు. అదే సమయంలో పాకిస్తాన్ కు 55 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలంటూ గాంధీ నిరాహారదీక్ష చేశారు. గాంధీ చర్యలను గాడ్సే తీవ్రంగా నిరసించాడు. ఆర్ఎస్ఎస్ వ్యూహాత్మక ఆలోచనలు కొన్ని నచ్చక ఆర్ఎస్ఎస్ ని వదిలిపెట్టి హిందూ మహాసభలో చేరాడు. 1948 జనవరి 30న మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు. తానే ఈ హత్య చేశానంటూ గాడ్సే విచారణ సమయంలో అంగీకరించాడు.

హిందూమహాసభ ఇప్పటికీ గాడ్సె వర్ధంతిని జరుపుకుంటూనేఉంది. ఈఏడాది నవంబర్ 15న దేశంలోని వందచోట్ల గాడ్సేని తలుచుకుంటూ కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి వారు `బలిదాన్ దివాస్’ అని పేరుపెట్టుకున్నారు. ఈసారి మరికాస్త ముందుకెళ్ళి హిందూమహాసభ మీరట్ శాఖ గాడ్సే జీవితవిశేషాలను పొందుపరిచిన వెబ్ సైట్ ని ఆవిష్కరించింది. అలాగే ఢిల్లీ శాఖ గాడ్సే జీవితవిశేషాలతో పుస్తకాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. గాడ్సే కార్యక్రమాల విషయంలో హిందూమహాసభ దాపరికం చూపడంలేదు. మనసులోఒకటి, పైకొకటి చెప్పడంలేదు. హిందూమహాసభ చాలా బాహాటంగానే తమధోరణి తేటతెల్లం చేస్తున్నది. అందుకు వారెంతో గర్విస్తున్నారు కూడా. గాడ్సే జయంతి, వర్ధంతులను దేశమంతటా జరుపుకుంటున్నామని హిందూమహాసభ అధ్యక్షుడు చంద్ర ప్రకాష్ కౌశిక్ ఢిల్లీలోని ఒక వార్తాసంస్థతో ముచ్చటిస్తూ చెప్పారు.

మరి ఆర్ఎస్ఎస్ మాటో…

హిందూమహాసభ తాను ఏంచేయాలనుకుంటున్నదో అది చేస్తున్నది. అయితే ఆర్ఎస్ఎస్ పరిస్థితే ఇందుకు భిన్నంగాఉంది. బిజెపీ అధికారంలో ఉండటంతో ఆర్ఎస్ఎస్ రైట్ వింగ్ సంస్థే అయినప్పటికీ అంతదూకుడుగా వెళ్లలేకపోతున్నది. బిజెపీకి తమ వల్ల అనవసరపు ఇబ్బందులు కలగడం ఆర్ఎస్ఎస్ కి ఇష్టంలేదు. ఇది అయోధ్యలో రామాలయ నిర్మాణం కంటే సున్నితమైనదిగా ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లుంది.

గాంధీని గాడ్సే హత్యచేసినప్పుడు అతను ఆర్ఎస్ఎస్ లో లేకపోయినప్పటికీ దేశమంతా ఆర్ఎస్ఎస్ నే అనుమానించింది. గాంధీ హత్యకు గురయ్యారని తెలియగానే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆశేతుహిమాచలం మిఠాయిలు పంచిపెట్టుకున్నారన్నది వాస్తవం. చాలాచోట్ల ఆర్ఎస్ఎస్ నాయకులు బాహిరంగంగా ఉండలేక, అరెస్టులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

వల్లభాయ్ పటేల్ ఏమన్నారు ?

ఈ సందర్భంగా ఒక విషయం గుర్తుచేసుకోవాలి. దేశ తొలి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ , గాంధీ హత్యానంతరం కొన్ని నెలలకు (1948 ఫిబ్రవరి 27)న నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకి లేఖ రాస్తూ, గాంధీ హత్యోదంతంలో ఆర్ఎస్ఎస్ ఉండకపోవచ్చని, ఈ పని సావర్కర్ నేతృత్వంలో హిందూమహాసభ చేసిన కుట్రేనని రాశారు. అయితే, గాంధీ హత్యను ఆర్ఎస్ఎస్ స్వాగతించినమాట నిజమేననీ, గాంధీజీ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్న ఈ రెండు రైట్ వింగ్ సంస్థలు (హిందూమహాసభ, ఆర్ఎస్ఎస్) బాపూ మరణం పట్ల హర్షాతిరేకం వ్యక్తం చేశాయని కూడా ఈ లేఖలో పటేల్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అనేక కుట్రలు చేసిఉండవచ్చు, కానీ ఈ కుట్ర (గాంధీ హత్య)మాత్రం ఆ సంస్థపనికాదని వల్లభాయ్ పటేల్ తన లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. గాంధీ హత్య జరగ్గానే మిఠాయిలు పంచుకోవడంపై ఆర్ఎస్ఎస్ పై చర్యలు తీసుకోవచ్చని కూడా వల్లభాయ్ పటేల్ ఆ లేఖలో రాశారు.

మోదీ రాకతో మారిన ఆలోచన

నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక, గాంధీ సిద్ధాంతాలపట్ల ఆయన ఆకర్షితులయ్యాక, ఆర్ఎస్ఎస్ తన పాతవాసనలను అటకెక్కించక తప్పని పరిస్థితి ఎదురైంది. అయితే, ఇప్పటికీ గాడ్సే పట్ల ఆర్ఎస్ఎస్ కి ద్వేషం ఉన్నదంటే ఎవ్వరూ నమ్మరు, కానీ మారిన పరిస్థితుల దృష్ఠ్యా, ఇప్పుడు హిందూమహాసభ శాఖలు గాడ్సేని నెత్తినెక్కించుకోవడంమాత్రం దానికి రుచించడంలేదు. గాడ్సేని ఆకాశానికెత్తేస్తూ నిర్వహించే ఏ కార్యక్రమాన్ని తాము అంగీకరించలేమంటూ ఆర్ఎస్ఎస్ సీనియర్ ఎం.జి. వైద్య అంటున్నారు. గాంధీ, గాడ్సేలు విభిన్నమైన భావజాలంతో సాగినమాట నిజమే, అయితే, భావజాల విబేధాలుగానే దీన్ని భావించాలేతప్ప, హింసాత్మక ధోరణిలో చూడకూడదని వైద్య అంటున్నారు.

గాంధీ పట్ల, ఆర్ఎస్ఎస్ గతంలోలాగా కఠినంగా వ్యవహరిస్తున్నట్లులేదు. ప్రధాని నరేంద్రమోదీ ఒకవైపున గాంధీ ఆశయాలను అక్కునచేర్చుకుని `స్వచ్ఛ్ భారత్’ వంటి పథకాలతో ముందుకుసాగిపోతున్నప్పుడు అతనికి బ్యాక్ సపోర్ట్ గా ఉండే ఆర్ఎస్ఎస్ అందుకు విరుద్ధంగా గాడ్సేని నెత్తినెక్కించుకోలేదు. ఈ కారణం వల్లనే గాడ్సే పేరిట నిర్వహించే కార్యక్రమాలకు ఆర్ఎస్ఎస్ దూరంగా ఉంటున్నది. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో గాంధీ పోరాటాలను ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మెచ్చుకుంటున్నది. అంతమాత్రాన గాంధీ సూచించిన అన్ని సిద్ధాంతాలను తాము అంగీకరించడంలేదంటూ వైద్య ముక్తాయింపు ఇస్తోంది.

బిజెపీ సంగతి సరేసరి, అదిప్పుడు అధికారంలో ఉండటంతో సాధ్యమైనంతవరకూ వివాదాస్పద విషయాల జోలికి పోలదల్చుకోలేదు. మరీ ముఖ్యంగా గాడ్సే, అయోధ్య వంటి సున్నిత విషయాల్లో. గాంధీ సిద్దాంతాల్లో కొన్నింటిని బిజెపీ గౌరవిస్తున్నది. ఈ నేపథ్యంలో గాడ్సేని నెత్తికెక్కించుకునే కార్యక్రమాలను ఈ పార్టీ నిర్ద్వందంగా ఖండిస్తున్నది.

గాడ్సేని స్మరించుకుంటే హిందూత్వం ప్రకాశవంతమవుతుందని కొందరు వాదిస్తున్నారు. కానీ ఆర్ఎస్ఎస్ ఉద్దేశంలో ఇది తప్పు. పైగా ఇలాచేయడం వల్ల హిందూత్వానికి చెడ్డపేరువస్తుందన్నది ఆర్ఎస్ఎస్ భావన. ఇప్పటికే దేశమంతటా `అసహనం’ పేరుకుపోయిందంటూ మేధావులు నిరసనగళం విప్పారు. కాంగ్రెస్ దీనిపై యాగీచేస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో బిజెపీని దులిపేయాలని చూస్తోంది. ఇలాంటి సమయంలో గాడ్సేకి ఉత్సవాలు, ఊరేగింపులు, గుళ్లు, గోపరాలు కట్టించడం వంటి ఆలోచనలవల్ల హిందూత్వ భావజాలానికే చెడ్డపేరు వస్తుందనీ, ఇది మోదీ ప్రభుత్వానికి అనవసరపు తలనొప్పి కలిగిస్తుందని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లుంది. అందుకే గాడ్సేకు దూరం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో గాడ్సే వర్థంతి అంటూ సభలు, కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఆర్ఎస్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే, గాడ్సే మాట తలిస్తేనే ఉలిక్కి పడుతోంది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com