జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలకు అన్యాయం జరుగుతోందన్న మాట చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే…గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా జాతీయ స్థాయిలో తన ప్రభావం చాలా గట్టిగా చూపిస్తోంది. తెలుగు సినిమా ప్రస్తావన లేకుండా ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకోవడం లేదు. వసూళ్లయినా… అవార్డులైనా. అది మరోసారి రుజువైంది. 71వ జాతీయ అవార్డుల్లో భాగంగా తెలుగు పరిశ్రమకు ఏకంగా 9 అవార్డులు దక్కాయి. మరీ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ‘భగవంత్ కేసరి’ తప్ప మిగిలినవన్నీ దాదాపుగా చిన్న సినిమాలే.
ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’ని ఎంపిక చేశారు. ఇది మాస్, కమర్షియల్ సినిమానే కావొచ్చు. కానీ ఆడపిల్లల పెంపకం గురించి, వాళ్ల విశిష్టత గురించి చెప్పిన సినిమా ఇది. ‘బనావ్ బేటీకో షేర్’ అనే స్లోగన్ ఈ సినిమాతో గట్టిగా వినిపించారు. ఈ కాన్సెప్ట్ జ్యూరీకి నచ్చి ఉంటుంది. బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించుకొన్న ‘హను -మాన్’కు కూడా జాతీయ అవార్డుల్లో తగిన గౌరవం దక్కింది. విజువల్ ఎఫెక్ట్స్, కొరియోగ్రఫీ విభాగాల్లో పురస్కారాలు దక్కించుకొంది. `బేబీ` ఖాతాలో రెండు అవార్డులు పడ్డాయి. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేష్ అవార్డు అందుకోబోతున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డు కూడా బేబీ చిత్రానికే దక్కింది. ‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి గానూ ఉత్తమ బాల నటిగా సుకుమార్ కుమార్తె కృతి ఎంపికైంది. ‘బలగం’లో ఊరు.. పల్లెటూరు పాట రాసిన కాశర్ల శ్యామ్ ఉత్తమ గేయ రచయితగా జ్యూరీ ఎంచుకొంది. `సార్` చిత్రానికి సంగీతం అందించిన జీవీ ప్రకాష్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. అయితే తమిళ వెర్షన్‌కు ఈ గుర్తింపు దక్కింది.
‘బలగం’ చిత్రానికి మరిన్ని అవార్డులు దక్కాల్సిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. తెలంగాణ నేపథ్యంలో సాగే కథ ఇది. చావు గురించి చెప్పినా ఆద్యంతం వినోదాత్మకంగా తీర్చిదిద్దారు. తెలంగాణ మట్టివాసన గుభాళించిన ఈ చిత్రానికి మరిన్ని పురస్కారాలు దక్కాల్సింది. కానీ ఒక్క అవార్డుతోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది.